ArticlesNews

ఎన్నాళ్ళీ ఉగ్రవాదమెన్నాళ్ళీ ఉన్మాదం?

490views

కేవలం నూపుర్ శర్మ ఫోటోను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నాడన్న ఒకే ఒక్క కారణంతో రాజస్థాన్ లోని ఉదయపూర్ లో కన్హయ్య లాల్ అనే టైలర్ ను కొందరు ముస్లింలు గొంతు కోసి చంపిన దుర్మార్గాన్ని మనం చూశాం. అసలు నూపుర్ శర్మ చేసిన తప్పేంటి? తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా, నిర్భయంగా వెల్లడించడమేనా? వారి పవిత్ర గ్రంథంలో ఉన్న విషయాన్నే తాను సందర్భానుసారం ఉటంకించానని ఆమె చెబుతున్న మాట నిజమా? కాదా? అన్నదానిపైన కదా అసలు చర్చ జరగాల్సింది? వారి గ్రంథంలో లేని విషయాన్ని ఆమె ఉద్దేశ్యపూర్వకంగా తప్పుగా ప్రస్తావించి ఉంటే ముమ్మాటికీ అది తప్పే. ఉన్న విషయాన్ని వక్రీకరించి చెప్పి ఉండినా తప్పే. ఒకవేళ ఉన్న విషయాన్ని ఆమె తప్పుగా అర్థం చేసుకుని ఉంటే ఆమెకు వివరించాల్సిన బాధ్యత ఆ మత పెద్దలది. ఇవేవీ జరక్కుండా ఆమెపై అనవసర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం, చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేయడం ఎంతవరకు సబబు?

ఒకవేళ అదే సబబనుకుంటే దశాబ్దాలుగా అటు క్రైస్తవులు, ఇటు ముస్లిములు హిందూ దేవీ దేవతలపై నిరాఘాటంగా సాగిస్తున్న దూషణల మాటేమిటి? హిందూ గ్రంథాలలోని అంశాలపై యథేచ్ఛగా సాగిస్తున్న వక్రీకరణల మాటేమిటి? ఒకనాటి చర్చి ఫాదరీలు, పాస్టర్లు, ముల్లాలు, మౌల్వీల దగ్గర్నుంచి నేటి క్రైస్తవ మత ప్రచారకులు, వ్యక్తిత్వ వికాస తరగతుల ముసుగులో ఇస్లాం భావజాలాన్ని వ్యాపింపజేస్తున్న బ్రదర్ షఫీ, సిరాజ్ వంటి మరికొందరు చేసిన, చేస్తున్న వక్రీకరణల విషయంలో కూడా హిందూ సమాజం కూడా ముస్లిముల లాగా హింసాత్మకంగా స్పందించాలా? నిజంగా అలా స్పందిస్తే… ఇప్పుడు నూపుర్ శర్మ పై ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్న వారిని సమర్థిస్తున్న వారు, హిందువుల ఆగ్రహావేశాలను కూడా ఇలాగే సమర్థిస్తారా?

నిజానికి ఎవరైనా, ఎవరి మనోభావాలనైనా, ఏ కారణం చేతనైనా కించపరచడం సమంజసం కాదు. అందుకే బిజెపి ముస్లిముల మనోభావాలను గౌరవిస్తూ నూపుర్ శర్మపై సంస్థాగతమైన చర్యలకు ఉపక్రమించింది. నిజానికి సమస్య అక్కడితో సమసిపోవాలి. కానీ నూపుర్ శర్మ పేరిట ఇలా హత్యాకాండ ఎందుకు మొదలైనట్టు? మొన్నామధ్య బంగ్లాదేశ్ లో ‘నూపుర్ సాహా’ అనే పేరున్న ఓ గర్భిణిపై అఘాయిత్యానికి పాల్పడి ఆమెను హత్య చేశారని కూడా వార్తలొచ్చాయ్. కారణం ఆమె పేరులో ‘నూపుర్’ ఉండడం. ఇంతకంటే దారుణమింకేమన్నా ఉంటుందా?

అసలు ముస్లిముల ప్రతినిధిగా చర్చలో కూర్చున్న వ్యక్తి శివలింగంపై చేసిన అత్యంత అవమానకర వ్యాఖ్యలకు ప్రతిగానే నూపూర్ శర్మ సదరు వ్యాఖ్యలు చేశారు. నూపూర్ శర్మ వ్యాఖ్యలను తప్పుపడుతున్న వారంతా అవతలి వ్యక్తి వ్యాఖ్యలను మాత్రం కన్వీనియంట్ గా ప్రక్కన పెట్టేశారు. మీడియా కూడా ఎక్కడా ఆ అంశంపై చర్చించలేదు సరికదా కనీసం వెలుగులోకి రానివ్వలేదు. ఆనాటి ఆ చర్చ కారణంగా ఇప్పుడు నూపూర్ శర్మ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రాణహాని పొంచి ఉంది. అదే అసలు వివాదానికి కారణమైన అవతలి వ్యక్తికి మాత్రం ఎలాంటి ఆపదా లేదు. అదీ ప్రస్తుత పరిస్థితి. మత సంబంధ విషయాలలో ముస్లిముల దూకుడుకు, హిందువుల ఉదాశీనతకు, మేథావులు మరియు మీడియా పక్షపాత ధోరణికి నిలువెత్తు నిదర్శనం ఈ సంఘటన. ఇప్పుడు… ఓ అమాయక హిందూ టైలర్ హత్య తర్వాత కూడా… వారందరూ అదే తరహా మౌనం వహిస్తున్నారు. ఇలాంటి సంఘటనే ఉల్టాలో జరిగుంటే ఈ పాటికి దేశం అట్టుడిగి పోతూ ఉండేది. మీడియాలో చర్చోపచర్చలు జరుగుతూ ఉండేవి. గుండెలు బాదుకుంటూ రోదించేవారు కనిపించేవారు. ప్లకార్డులు, కొవ్వొత్తుల ప్రదర్శనలు, మానవహారాలతో అద్భుతమైన దృశ్యాలు శతదినోత్సవం దిశగా సాగుతూ ఉండేవి.

నిజానికి ఇక్కడ సమస్య నూపుర్ శర్మ కాదు. అవతలి వారి అసహనం, మేథావులు, మానవ హక్కుల సంఘాలు, మీడియాల అమ్ముడుపోయినతనమే అసలు సమస్య. కారణమేదైనా, ప్రాంతం ఏదైనా అది నిరంతరం ఇలా ఉగ్ర రూపంలో వెల్లడవుతూనే ఉంటుంది. ఈ స్వయంప్రకటిత మేథోవర్గం వారికి వంతపాడుతూనే ఉంటుంది. ఏదో ఒక పేరుతో ప్రక్క మతాల వారిపై దాడులకు తెగబడటం, వారి ఆలయాలకు, ఆస్తులకు, మానప్రాణాలకు, విశ్వాసాలకు, ధర్మానికి నష్టం కలిగించడమే వారి అసలు లక్ష్యం. ఆ కారణం సీఏఏ కావచ్చు, 370 ఆర్టికల్ రద్దు కావచ్చు, రోడ్లపై నమాజుకు అనుమతించకపోవడం కావచ్చు, నూపుర్ శర్మ వ్యాఖ్యలూ కావచ్చు. కారణమేదైనా హింస మాత్రం పక్కా.

నిజానికి ఈ తరహా వ్యవహార శైలి భారతీయ మౌలిక విధానాలకు విరుద్ధమైనది. భారతదేశం యుగయుగాలుగా వివిధ సిద్ధాంతాలకు, వాదాలకు, ఆచార వ్యవహారాలకు, వేషభాషలకు ఆలవాలం. త్రేతా యుగంలోనే సత్యకాముడు నాస్తికవాదాన్ని వినిపించాడు. అప్పుడు అతనికేమీ ప్రాణ హాని కలుగలేదే? ఏ వాదాన్నైనా, సిద్ధాంతాన్నైనా పరస్పర వాదోపవాదాలు, చర్చల ద్వారానే నిరూపించి నిగ్గు తేల్చుకునే విధానాన్నే అప్పటి నుంచి మనం అనుసరిస్తూ వస్తున్నాం. భారతదేశ చరిత్రలో ఇలాంటి తార్కాణాలు ఎన్నో కనిపిస్తాయి. జగద్గురు ఆదిశంకరులు తన అద్వైత సిద్ధాంతాన్ని వాదోపవాదాలు, చర్చల ద్వారానే ప్రపంచం ముందు ప్రతిపాదించారు. మండన మిశ్రునితో ఆదిశంకరులు చేసిన శాస్త్ర వాదం చారిత్రాత్మకం. ఇలా భారతదేశంలో ఎన్నో వాదాలు, సిద్ధాంతాలు నిర్భీతిగా మనుగడ సాగించాయి.

ఈ దేశంలో నివసించే ఏ మతం వారైనా, వారి మూలమేదైనా, మూల సిద్ధాంతము, గ్రంథము, ఆరాధనా పద్ధతులు వగైరాలేవైనా ప్రాథమికంగా వారు ఈ దేశ రాజ్యాంగానికి, అనాదిగా ఆచరిస్తూ వస్తున్న కొన్ని మౌలిక సాంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకోవటం అత్యంతావశ్యకం.

ఎవరైనా సరే అవసరమైనప్పుడు, చర్చ రేగినప్పుడు తమ గ్రంథాలు, శాస్త్రాలు, విశ్వాసాలపై చర్చలకు తావిస్తే నిజాల నిగ్గు తేలే అవకాశం ఉంటుంది. కనీసం చర్చకు అవకాశం ఉంటుంది. ఎవరి అవగాహనను బట్టి వారు ముందుకెళ్ళే అవకాశమూ ఉంటుంది. అలా కాక ఇలా చీటికీ మాటికీ మనోభావాల పేరుచెప్పి దాడులకు, హత్యలకు పూనుకుంటున్నారంటే ఏమని అర్థం? మీ పవిత్ర గ్రంధంలోని విషయాలు వాదనకు నిలువలేవనా? నిలువగలదనుకున్నప్పుడు చర్చకు అభ్యంతరమెందుకు? అసలు ప్రపంచంలో ఎలాంటి వాదనకు, చర్చకు ఆస్కారం లేని అంశం ఉంటుందా? ఖచ్చితంగా ప్రతి అంశంపైనా చర్చ జరగాల్సిందే కదా? సత్యాసత్యాలు వెల్లడి కావాల్సిందే కదా? పాత రాతి యుగం నాటి విశ్వాసాలతో ఈ ఆధునిక యుగంలో సైతం మానవాళిపై ఈ తరహా ఉగ్రవాదము, ఉన్మాదము ఇంకా ఎన్నాళ్లు? ప్రపంచ వ్యాప్తంగా అందరూ కలిసి దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే కొందరి ఈ తరహా వ్యవహార శైలి కారణంగా యావత్ ప్రపంచమానవాళికి ముప్పు పొంచి ఉన్నదనే చెప్పాలి. తస్మాత్ జాగ్రత్త.

– శ్రీరాంసాగర్.