News

శతాబ్దాల సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ.. రాజస్థాన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం

30views

శతాబ్దాల కాలంగా వస్తున్న కట్టుబాట్లను, పురుషాధిక్య రాజకుటుంబ సంప్రదాయాలను పక్కన పెడుతూ రాజస్థాన్ చరిత్రలో ఒక అద్భుతమైన సామాజిక మార్పు చోటుచేసుకుంది. రాజ్‌పుత్ సంప్రదాయాల ప్రకారం కేవలం మగవారికే పరిమితమైన చారిత్రాత్మక ‘పాగ్ కా దస్తూర్’ (తలపాగా చుట్టే వేడుక)ను 13 ఏళ్ల బాలికకు నిర్వహించారు. పాలి జిల్లాలోని ఖేర్వాగఢ్ వంశానికి మొదటి మహిళా వారసురాలిగా తేజస్వి కుమారి జోధా అధికారికంగా బాధ్యతలు స్వీకరించి సరికొత్త రికార్డు సృష్టించింది.

పాలి జిల్లాలోని చారిత్రాత్మక ఖేర్వా కోటలో వందల మంది గ్రామస్థులు, సంఘ పెద్దల సమక్షంలో ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఇటీవల తేజస్వి కుమారి తండ్రి హరీశ్ చంద్ర జోధా అకాల మరణం చెందారు. ఆ వంశంలో మగ వారసులు ఎవరూ లేకపోవడంతో గత 65 ఏళ్లుగా ఈ కోటలో ‘పాగ్ కా దస్తూర్’ వేడుక జరగలేదు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా, లింగ సమానత్వాన్ని గౌరవిస్తూ తేజస్వి కుమారిని వారసురాలిగా ప్రకటించాలని కమ్యూనిటీ పెద్దలు ఏకగ్రీవంగా నిర్ణయించారు.

ఈ సంప్రదాయ క్రతువులో భాగంగా జోధ్‌పూర్-మార్వార్ పూర్వ రాజకుటుంబం నుండి ప్రత్యేకంగా పంపిన గులాబీ రంగు తలపాగాను వేద మంత్రోచ్ఛారణల మధ్య తేజస్వి తలపై చుట్టారు. రాజ్‌పుత్ ఆచారం ప్రకారం ఆమె నుదుటిపై రక్తంతో తిలకం దిద్దారు. ఒక రాజకుటుంబం లేదా వంశ పెద్ద మరణించినప్పుడు, ఆ బాధ్యతలను తదుపరి తరం వారసుడికి అప్పగించడానికి ఈ ‘పాగ్ కా దస్తూర్’ వేడుకను నిర్వహిస్తారు. ఎంతో గంభీరంగా సాగిన ఈ వేడుకలో 13 ఏళ్ల తేజస్వి ఎంతో పరిణతితో, హుందాగా కూర్చుని అందరినీ ఆకట్టుకుంది.

ప్రస్తుతం 7వ తరగతి చదువుతున్న తేజస్వి కుమారి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన చదువును కొనసాగిస్తూనే, వంశ వారసత్వంగా వచ్చిన ఈ కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పింది. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా గ్రామాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని స్పష్టం చేసింది. రాజస్థాన్ లాంటి సంప్రదాయాలు దట్టంగా ఉన్న ప్రాంతంలో, ఒక బాలికకు ఇటువంటి అరుదైన గౌరవం దక్కడం సామాజిక ఆధునికతకు, మహిళా సాధికారతకు ఒక గొప్ప మైలురాయి అని స్థానికులు కొనియాడారు.