
స్వాతంత్య్ర ఉద్యమాన్నిగానీ… బ్రిటిష్‌పై పోరాటాన్నిగానీ… 1947కు ముందు జరిగిన చరిత్రనుగానీ పెద్దగా పట్టించుకోని… అవిభాజ్య భారత్‌తో బంధాన్ని తమ విద్యార్థులకు బోధించని పాకిస్థాన్ ఇప్పుడు ఏకంగా… 5వేల సంవత్సరాల ముందునాటి సింధూ నాగరికతపై మోజు పడుతోంది! సంస్కృతంతో మాకూ సంబంధముందంటూ ప్రచారం చేసుకుంటోంది. అంతేకాదు మరో అడుగు ముందుకేసి… సంస్కృత వ్యాకరణ కర్త పాణిని మావాడే అంటోంది!
ఈ చిత్రవిచిత్రాలన్నీ ఎందుకో తెలుసా… సింధూ జలాల కోసం!
సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ పక్కన పెట్టిన నేపథ్యంలో పాకిస్థాన్‌కు అకస్మాత్తుగా తన సింధూ నదీ నాగరికత మూలాలు జ్ఞాపకం వస్తున్నాయి. తన మూలాలు క్రీస్తు పూర్వం 3300 సంవత్సరం నాటి సింధూ నాగరికతతో మొదలవుతాయంటూ చాటుకొని జల ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తోంది. విదేశీ రాయబారులను తీసుకొని వచ్చి వారితో చిలకపలుకులు పలికిస్తోంది. ఇందులో భాగంగా… బ్రిటిష్ హైకమిషనర్ పాకిస్థాన్ సాంస్కృతిక వారసత్వ సంపద పరిరక్షణకు నిధిని ప్రకటించారు. పాక్ భూభాగంలో ఉన్న పురాతన తక్షశిల విశ్వవిద్యాలయం విలసిల్లిన ప్రాంతాన్ని ఆస్ట్రేలియా రాయబారి సందర్శించారు. పాకిస్థాన్ ‘‘అసాధారణ’’ వారసత్వ సంపదను ప్రశంసించారు. సింధూ జలాల కోసం సాగుతున్న సంఘర్షణలో భాగంగానే పాక్ తన భూభాగంపై ఇస్లాం ఆవిర్భావానికి పూర్వం పరిఢవిల్లిన చరిత్రను చాటుకుంటోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. చారిత్రక ప్రదేశాల సంరక్షణ ముఖ్యమే అయినా సైనిక నియంత జియావుల్ హక్ పరిపాలనా కాలం నుంచీ తన చరిత్రకు క్రీ.శ. 711లో మొహమ్మద్ బిన్ ఖాసిం సింధ్ ప్రాంతంపై చేసిన దండయాత్రనే మూలంగా చెబుతూ వచ్చిన పాక్ ఇప్పుడు తన సింధూ నాగరికత మూలాలను ప్రముఖంగా ప్రస్తావిస్తోంది.
పాకిస్థాన్‌లో సంస్కృత భాషకు అందుతున్న ప్రోత్సాహంపై బీబీసీ ఒక వీడియో రూపొందించింది. ‘‘దేశ విభజనానంతరం తొలిసారిగా పాకిస్థాన్ ఉన్నత విద్య పాఠ్య క్రమంలో సంస్కృతానికి చోటు లభిస్తోంది. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్‌లో రెండు సంస్కృత కోర్సులు బోధిస్తున్నారు. సంస్కృతం పాఠ్యక్రమంలో భాగం కానుంది. డాక్టర్ షాహిద్ రషీద్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్నారు’’ అని బీబీసీ పేర్కొంది. లాహోర్‌లోని అనార్కలీ బజారులో ఒకప్పుడు సంస్కృత పుస్తకాలు ప్రచురితమయ్యేవని, ఇక్కడి నుంచి హిందూస్థాన్ మొత్తానికి అవి సరఫరా అయ్యేవని డాక్టర్ రషీద్ చెప్పిన మాటల్ని వీడియో చాటుతోంది.
పాణిని మావాడే..
‘‘సంస్కృతం పాకిస్థాన్‌లో ఆవిర్భవించింది. ప్రసిద్ధ సంస్కృత వ్యాకరణకర్త పాణిని స్వాబి ప్రాంతంలోని ఒక గ్రామంలో జన్మించారు. ఆయన పాకిస్థాన్‌లోని తక్షశిల విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయునిగా పనిచేశారు’’ అని పాకిస్థాన్‌కు చెందిన ఒకరు సోషల్‌మీడియాలో పోస్టు చేశారు.
ఇవన్నీ చెప్పటం ద్వారా… సింధూజలాలపై తమకూ హక్కు ఉందని ప్రపంచానికి చాటడానికి, అంతర్జాతీయ వేదికలపై తన వాదనను బలోపేతం చేసుకోవటానికి పాక్ ప్రయత్నాలు చేస్తోంది.





