News

రూ. 25 కోట్ల విలువైన మరకత పంచముఖ గ‌ణ‌ప‌తి విగ్రహం స్మగ్లింగ్‌కు య‌త్నం

482views

ప్ర‌కాశం: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో విలువైనదిగా ప్రచారమవుతున్న మరకత పచ్చ పంచముఖ గణేశుడి పురాతన విగ్రహం స్వాధీనం పోలీసు వర్గాల్లోనే కాకుండా రాజకీయంగానూ చర్చకు తావిస్తోంది. అది పురాతన విలువైన విగ్రహమేనా? విగ్రహానికి సంబంధించిన పత్రాలను చూపించి తమదని నిరూపించుకోవాలని నిందితులకు వారం సమయం ఇవ్వడమేంటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది.

రెండున్నర అడుగుల ఎత్తు, రెండడుగుల వెడల్పుతో 90 కిలోల బరువున్న ఈ విగ్రహాన్ని కొందరు రూ.25 కోట్లకు విక్రయించేందుకు బేరసారాలు సాగిస్తున్నట్టు ఒంగోలు క్రైం బ్రాంచి పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో వారే కొంటామంటూ నమ్మబలికి అక్కడికి వెళ్లారు. యర్రగొండపాలెం-వినుకొండ రోడ్డులోని మారం వెంకటేశ్వరరెడ్డికి చెందిన షెడ్డులో విగ్రహాన్ని ఈనెల 10న స్వాధీనం చేసుకున్నారు. విగ్రహాన్ని అక్కడి పోలీసులకే అప్పగించి తిరిగి వచ్చేశారు. ఇక్కడ పోలీసుల వ్యవహార శైలి అనుమానాలకు తావిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఒక రోజు ఆలస్యంగా కేసు నమోదైంది. విగ్రహం అసలు వ్యవహారం హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో ఐదేళ్ళ కిందట కొన్ని రోజులపాటు నడిచిందని పోలీసులు చెబుతున్నారు.

గతంలో యర్రగొండపాలెం పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, ఆయన అల్లుడు.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంద్రసేనారెడ్డి న్యాయస్థానం ద్వారా విగ్రహానికి సంబంధించిన హక్కులు పొందారని అంటున్నారు. కలిసి రావడం లేదనే కారణంతో విగ్రహాన్ని కొన్ని రోజులు దాచాలని యర్రగొండపాలేనికి చెందిన మారం వెంకటేశ్వరరెడ్డికి ఇంద్రసేనారెడ్డి ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు. విగ్రహం రూ.కోట్ల విలువైనదని ప్రచారమవడంతో ఇద్దరు మంత్రులు రంగప్రవేశం చేశారని, దీంతో పోలీసులు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలున్నాయి. కోర్టు ఉత్తర్వులు ఉండటంతోపాటు విలువైనది కాదనే కారణంతో స్థానిక పోలీసులకు విగ్రహాన్ని అప్పగించి వచ్చేసినట్టు ఒంగోలు క్రైం బ్రాంచ్‌ పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి