
* పాకిస్థాన్ ముష్కరుల కుట్ర భగ్నం
వాయు మార్గంలో డ్రోన్ల ద్వారా దేశంలోకి అక్రమంగా పేలుడు పదార్థాలను సరఫరా చేసేందుకు పాకిస్థాన్ ముష్కరులు చేస్తున్న ప్రయత్నాలను జమ్మూ పోలీసులు భగ్నం చేశారు.
సరిహద్దుల్లో అలాంటి ఓ డ్రోన్ ను గుర్తించి కాల్పులు జరిపారు. డ్రోన్ నుంచి జారవిడిచిన మూడు మ్యాగ్నెటిక్ ఐఈడీ బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అఖ్నూర్ సెక్టార్‌లోని భారత్ – పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో నిన్న రాత్రి ఓ డ్రోన్ సంచరిస్తున్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించి కాల్పులు జరిపారు. ఆ తర్వాత పోలీసు పార్టీ అక్కడ మోహరించి యాంటీ డ్రోన్ వ్యవస్థను రంగంలోకి దించారు. అనంతరం రాత్రి 11 గంటల ప్రాంతంలో కనచక్‌లో మరోసారి డ్రోన్ కన్పించింది. వెంటనే భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే డ్రోన్‌లో ఉన్న పేలోడ్ కిందపడగా.. డ్రోన్ మాత్రం తప్పించుకున్నట్లు జమ్మూ అదనపు డీజీపీ ముకేశ్ సింగ్ తెలిపారు.
డ్రోన్ నుంచి జారిపడిన పేలోడ్‌లో టిఫిన్ బాక్సుల్లో ఉన్న మూడు మ్యాగ్నెటిక్ ఐఈడీలను పోలీసులు గుర్తించారు. వాటికి టైమర్ కూడా సెట్ చేసి ఉంచినట్లు తెలిపారు. బాంబులను నిర్వీర్యం చేసి ఘటనపై కేసు నమోదు చేశామని ముకేశ్ సింగ్ వెల్లడించారు.
అమర్నాథ్ యాత్రే లక్ష్యంగా విధ్వంసం సృష్టించాలని పాక్ గత కొంతకాలంగా చేస్తోన్న కుట్రలను పోలీసులు ఎప్పటికప్పుడు భగ్నం చేస్తున్నారు. గత నెలాఖర్లోనూ కథువాలోని తాల్లీ హరియాచాక్ గ్రామం వద్ద ఓ క్వాడ్‌కాప్టర్‌ను జమ్మూకశ్మీర్ పోలీసులు కూల్చివేశారు. అందులో ఏడు మ్యాగ్నెటిక్ బాంబులు, ఏడు యూజీబీఎల్ గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు.





