News

మహారాష్ట్రలో ముదురుతున్న లౌడ్ స్పీకర్ల వివాదం

526views

* మసీదులకున్న లౌడ్ స్పీకర్లు తీయకపోతే… మసీదు ముందు స్పీకర్ లు పెట్టి హనుమాన్ చాలీసా వినిపిస్తాం… హెచ్చరించిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన

హారాష్ట్రలో లౌడ్ ‌స్పీకర్ల రగడ ప్రారంభమైంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) ప్రధాన కార్యాలయంపై లౌడ్ ‌స్పీకర్ పెట్టి హనుమాన్ చాలిసా పఠించడంతో రగడ తీవ్రమైంది. మసీదుల వద్ద ఉండే లౌడ్ ‌స్పీకర్లను తీసేయాలని లేదంటే మసీదుల ముందు హనుమాన్‌ చాలీసా వినిపిస్తామని ఎంఎన్ఎస్ నేత రాజ్ థాకరే హెచ్చరించారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది సమయానికే ఎంఎన్ఎస్ కార్యాలయంపై లైడ్ ‌స్పీకర్లు పెట్టారు. అయితే వీటికి అనుమతి లేకపోవడంతో ఎంఎన్ఎస్ నేత మహేంద్ర భానుషాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలేశారు. 5,050 రూపాయల జరిమానా విధించి, మరోసారి రిపీట్ అయితే చర్యలు తీసుకుంటామని నోటీసు ఇచ్చారు. ప్రస్తుతం ముంబైలో శివసేన, ఎంఎన్ఎస్ కార్యకర్తల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోషల్ మీడియాలో ఇరు పార్టీల కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ప్రభుత్వం మెజారిటి ప్రజలను అవమానిస్తోందని ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఆరోపణలు చేస్తుండగా.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విధ్వేషాలు రెచ్చగొట్టాలని చూడొద్దని శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఎంఎన్ఎస్ నేత మహేంద్ర భానుషాలి మీడియాతో మాట్లాడుతూ ‘‘లౌడ్ ‌స్పీకర్లకు ఎవరూ అనుమతి తీసుకోలేదు. ఒకవేళ ఇది చట్ట వ్యతిరేకమైతే అందరిపైనా చర్యలు తీసుకోవాలి. పోలీసులు వాళ్ల డ్యూటీ వాళ్లు చేశారు. పోలీసులతో ఏమీ మాట్లాడకండని రాజ్ థాకరే చెప్పారు. కానీ అనుమతులు లేకుండా లౌడ్ ‌స్పీకర్లు పెట్టిన అందరిపైనా చర్యలు తీసుకోవాలన్నదే మా డిమాండ్’’ అని భానుషాలి అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.