
న్యూఢిల్లీ: కశ్మీర్ విషయంలో భారత దేశంపై ఇస్లామిక్ సహకార సంఘం నిరాధార వ్యాఖ్యలు చేసిందని భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పులు, వక్రీకరణల ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడింది. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో గురువారం జరిగిన ఫారిన్ మినిస్టీరియల్ మీటింగ్‌లో ఓఐసీ ఈ వ్యాఖ్యలు చేసింది.
కశ్మీరుపై భారత దేశ విధానంపై ఓఐసీ చేసిన విమర్శలను భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) శుక్రవారం తీవ్రంగా ఖండించింది. ఎంఈఏ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ, ఒఐసి సమావేశంలో చేసిన తీర్మానాలు, ప్రకటనలు రెండు విషయాలను స్పష్టం చేస్తున్నాయన్నారు. ఒఐసికి ఈ అంశంతో సంబంధం లేదని, అదేవిధంగా ఈ వ్యవస్థను మాయ చేసి, అనైతికంగా పాకిస్థాన్ తప్పుదారి పట్టిస్తోందని స్పష్టమవుతోందని తెలిపారు.
తప్పులు, వక్రీకరణల ఆధారంగా భారత దేశంపై ఒఐసి సమావేశంలో తీర్మానాలు చేశారన్నారు. మైనారిటీలను సరైన విధంగా చూడటంపై ఈ వ్యవస్థ వ్యాఖ్యలు చేయడం అసంబద్ధంగా ఉందని పేర్కొన్నారు. వరుసగా మానవ హక్కులను ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్ వంటి దేశాలను ముందు పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేయడంలో అసంబద్ధత స్పష్టమవుతోందన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసే దేశాలు, ప్రభుత్వాలు వాటి ప్రభావం తమ పేరు, ప్రఖ్యాతులపై పడుతుందని గుర్తించాలని హితవు పలికారు.





