News

తితిదే ఆధ్వర్యంలో చిన్నారుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు కసరత్తు

482views

చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏడాదిన్నరలోపు పూర్తి చేయాలి : టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి

చిన్నారులకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని ఏడాదిన్నర లోపు పూర్తి చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో ఇంజనీరింగ్ అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.

చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంతోపాటు అధునాతన వైద్య పరికరాలు సమకూర్చుకునేందుకు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలని జెఈఓ శ్రీ వీరబ్రహ్మంను ఆదేశించారు. ఆసుపత్రి నిర్వహణకు సంబంధించి ఇతర ప్రముఖ ఆసుపత్రుల యాజమాన్యంతో చర్చించి వారి నైపుణ్యాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఆలయ పరిసరాల్లో పలు అభివృద్ధి పనులకు ఏర్పాట్లు

తిరుమలలోని పలు కాటేజీల్లో చాలాకాలం క్రితం ఏర్పాటు చేసిన ఫ్యాన్లను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. పాంచజన్యం, అష్టవినాయక విశ్రాంతి గృహాల్లో లిఫ్టులను తొలగించి నూతనంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కౌస్తుభం విశ్రాంతి గృహంలో పాత స్విచ్ బోర్డులను తొలగించి మాడ్యులర్ స్విచ్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. తిరుమలలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు గాను 750 KVA DG SET ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

తిరుమలలోని మార్కెటింగ్ గోడౌన్, గంగమ్మ గుడి ప్రాంతాల్లో వెలుతురు ఉండేలా విద్యుద్దీపాలు మరిన్ని ఏర్పాటు చేయాలన్నారు. శ్రీవారి ఆలయ పరిసరాల్లో పిడుగుల నివారణకు అవసరమైన పరికరాలు అమర్చాలని సూచించారు. తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం ప్రాంతంలో భూగర్భ కేబుళ్లను మార్చాలన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లో కేబుళ్లు విడివిడిగా లేకుండా కేబుల్ ట్రే ఏర్పాటు చేయాలన్నారు. గోగర్భం డ్యామ్ వద్ద చాలా ఏళ్ళ క్రితం ఏర్పాటుచేసిన పైపుల స్థానంలో కొత్త పైపులు ఏర్పాటు చేయాలన్నారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్ నద్ద స్టాండ్ బై పద్ధతిలో మోటార్లు, పంపులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కర్ణాటక సత్రాల వద్ద డిసెంబర్ నాటికి రెండు బ్లాకులను పూర్తిస్థాయిలో నిర్మించాలన్నారు.

అనంతరం తిరుపతిలోని ఎస్వీ డైరీ ఫారం వద్ద నేషనల్ హైవేస్ స్వాధీనం చేసుకున్న స్థలానికి సంబంధించిన అంశంపై అధికారులతో చర్చించారు.

ఈ సమావేశంలో జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, లా ఆఫీసర్ శ్రీ రెడ్డెప్ప రెడ్డి, డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాసులురెడ్డి, ఎస్టేట్ అధికారి శ్రీ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.