
విజయవాడ: ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకూ నిర్వహించనున్న సైన్స్ వారోత్సవాల్లో భాగంగా ఏపీలోని విజయవాడలోని ఆర్కిటెక్చర్ కళాశాల ఆవరణలో అత్యాధునిక మిసైళ్ళ ప్రదర్శన ఏర్పాటు చేశారు.
భారత రక్షణ రంగంలో కీలకమైన 15 మిసైళ్ళ నమూనాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. వీటిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఒ) రూపొందించింది. ముఖ్యంగా శాటిలైట్ల ప్రయోగాలు, విధానాలపై ఇస్రో ఈ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది.

విజయవాడ సైన్స్ పండగ ఆర్గనైజింగ్ కన్వీనర్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆండ్ ఆర్కిటెక్చర్ (ఎస్‌పిఎ) అసిస్టెంట్ రిజిస్ట్రార్ పివిఎస్ శ్యామ్‌కుమార్ మాట్లాడుతూ డిఆర్‌డిఒ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన మిసైళ్ళను ఇక్కడ ప్రదర్శించినట్టు వెల్లడించారు. విజ్ఞాన ప్రసార్ ఆధ్వర్యాన డిఎస్‌టి, డిబిటి, సిఎస్‌ఐఆర్, ఎంఇఎస్, ఇస్రో, డిఎఇ, ఐసిఎంఆర్, డిఆర్‌డిఒ సంస్థలు ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తున్నాయి.

పిల్లల్లో సాంకేతిక విజ్ఞానం పెంపొందించేందుకు…
స్వాతంత్య్రానంతరం దేశంలో రూపొందిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా పిల్లల్లో సైన్స్, ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఎలా ఉందనే విషయాలపై అవగాహన కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని శ్యామ్‌కుమార్ తెలిపారు.

దేశ రక్షణ రంగంలో వినియోగించే మిసైళ్ల పరిజ్ఞానం, వాటిని ఎలా తయారు చేస్తారు, ఎలా వినియోగిస్తారు అనే అంశాలపై నమూనాలు, వీడియోలు, సైన్స్ ఫిలిమ్స్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. రాష్ట్ర చరిత్రలో ఈ తరహా సైన్స్ ప్రదర్శన తొలిసారని, ఇప్పటి వరకూ మిసైళ్ల ఎగ్జిబిషన్ రక్షణ రంగ ప్రాంగణాల్లోనే జరిగిందని పేర్కొన్నారు.





