
గుంటూరు: దేశ విభజనకు కారకుడైన, పాకిస్థాన్ జాతిపితగా భావిస్తున్న మొహమ్మద్ ఆలీ జిన్నా పేరుతో గుంటూరు నడిబొడ్డులో స్వాతంత్య్రం ముందు నుండి ఉంటున్న ఒక టవర్‌ను ఇంకా కొనసాగించడంపై బిజెపి నాయకత్వం, పలు హిందూ సంస్థలు లేవనెత్తిన అభ్యంతరాలపై వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగి వచ్చింది. ఎట్లాగైతే ఆ టవర్‌కు భారత జాతీయ పతాకంను సూచించే మూడు రంగులను వేశారు.
అయితే, ఆ టవర్ పేరు మార్చడానికి మాత్రం ఇంకా వెనుకడుగు వేస్తున్నారు. నిజమైన దేశభక్తులెవరూ ఇంకా జిన్నా పేరు కొనసాగించేందుకు ఇష్టపడరని, తక్షణం టవర్‌కు జిన్నా పేరు తొలగించాలని బిజెపి డిమాండ్ చేయడం జాతీయ స్థాయిలో ప్రజల దృష్టి ఆకర్షించింది. పెద్ద చర్చనీయాంశమయింది.
గుంటూరు జిల్లా బీజేపీ నేత పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ విషయమై జరిగిన ఆందోళన కార్యక్రమాలు నగరంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడంతో ప్రభుత్వం సర్దుబాటు చర్యలకు దిగాక తప్పలేదు. ఈ విషయమై బిజెపి- వైసిపి మంత్రుల మధ్య జరిగిన మాటల యుద్ధంలో నిలబడలేక అధికారపక్షం నాయకులు తలవంచుకొని పరిస్థితి ఏర్పడింది.
జిన్నా పేరు మార్చకపోతే తామే టవర్‌పై జాతీయ జెండా ఎగురవేస్తామని పాటిబండ్ల చేసిన హెచ్చరిక రాష్ట్ర ప్రభుత్వంలో కలవరం కలిగించింది. మొదటి వైసిపి నేతలు ఈ అంశంపైనా ఎంతగా ఎదురు దాడి చేసినా, తమకు మద్దతుగా స్థానిక ముస్లింలను సమీకరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
బీజేపీ-టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పేరు ఎందుకు మార్చలేదని అంటూ మంత్రి వెల్లంపల్లి తదితరులు ఎదురుదాడి చేసినప్పటికీ, బీజేపీ తెరపైకి తెచ్చిన సెంటిమెంటును మాత్రం పక్కదారి మళ్లించలేకపోయారు. దీనితో గుంటూరు కార్పొరేషన్‌లో పాలక వైసీపీ వస్తాదులు మధ్యేమార్గాన్ని ఎన్నుకున్నట్టు కనిపించింది.
అందులో భాగంగా జిన్నావర్‌కు జాతీయ పతాకంలోని మూడురంగులు వేయాలని నిర్ణయించింది. ఆ మేరకు దానిని పూర్తి చేసింది. మూడోతేదీన అక్కడ జాతీయ జెండా ఎగురవేస్తామని మేయర్ కావేటి మనోహర్ నాయుడు వెల్లడించారు. అయితే ఆ టవర్‌పై జాతీయ పతాకాన్ని ఎగురవేసే ధైర్యం మాత్రం చేయలేకపోతున్నారు.
పక్కనే కట్టిస్తున్న ఓ ప్రత్యేకమైన గద్దెపైన ఎగురవేస్తున్నట్టు ప్రకటించారు. టవర్‌పై భారతీయ జెండా ఎగురవేస్తే పాకిస్తాన్ అభిమానులకు ఎక్కడ కోపం వస్తుందో అని భయపడుతున్నట్లున్నారు. ఆ విధంగా చేస్తే పాకిస్థాన్ ప్రభుత్వం, జిన్నా వారసులు ఎవ్వరు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం లేదు.
అయినా, జగన్ ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? గుంటూరుతో జిన్నాకు ఎటువంటి సంబంధం లేదు. అక్కడ ఆ టవర్‌ను తొలగించాలని అర్ధశతాబ్ధ కాలం ముందే పురపాలక సంఘం ఓ తీర్మానం చేసింది. అయినా అమలుపరచే సాహసం కాంగ్రెస్ నాయకులు చేయలేకపోయారు.
Source: Nijamtoday
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





