News

ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహం

576views

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర ఉద్యమంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ పోషించిన పాత్రను గౌరవిస్తూ ఆయన విగ్రహాన్ని న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వెల్ల‌డించారు. నేతాజీ 125వ జయంతిని యావత్తు దేశం జరుపుకొంటున్న వేళ గ్రానైట్‌తో తయారు చేసిన ఆయన విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేస్తామనే విషయాన్ని అందరితో పంచుకుంటుండటం తనకు సంతోషంగా ఉందని ఓ ట్వీట్‌లో తెలిపారు.

ఇది రుణం తీర్చుకునే, కృతజ్ఞతాభావానికి ప్రతీక అని ప్రధాని తెలిపారు. దివ్యమైన నేతాజీ విగ్రహం తయారీ పూర్తయ్యే వరకు ఇండియా గేట్ వద్ద ఆయన హోలోగ్రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఎల్లుండి(23న) నేతాజీ జయంతి సందర్భంగా ఆవిష్కరిస్తానని ఆయన తెలిపారు.

మొదటి ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఆజాద్ హింద్ ఫౌజ్‌ను నేతాజీ ఏర్పాటు చేశారు. 1943లో ఈ సైన్యాన్ని ఏర్పాటు చేసి, బ్రిటిష్ పాలకులపై సాయుధ తిరుగుబాటును ప్రారంభించారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనేవిధంగా వేలాది మంది భారతీయులను ప్రేరేపించారు. ‘‘నువ్వు నాకు రక్తాన్ని ఇవ్వు, నేను నీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను’’, ‘‘జైహింద్’’, ‘‘ఢిల్లీ చలో’’ వంటి నినాదాలతో భారతీయులను ప్రేరేపించి, ఉత్తేజితులను చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి