
-
కేరళలోని షంగుముఖం దేవి కోవెలలో సంఘటన
తిరువనంతపురం: కేరళ, తిరువనంతపురంలోని షంగుముఖం దేవి ఆలయంలో అక్కడి ఉద్యోగులు కొంతమంది అమ్మవారి బంగారు ఆభరణాలను దొంగిలించారు. విజిలెన్స్ అధికారులు అందర్నీ విచారించారు. ఆలయానికి చెందిన తిరువాభరణం (పురాతన బంగారు ఆభరణాలు) ఇక్కడి అధికారులే తప్ప మరెవరో చోరీ చేయలేదని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) విజిలెన్స్ అధికారులు ధ్రువీకరించారు.
ఈ కేసులో నలుగురు టీడీబీ అధికారులపై దేవస్వం విజిలెన్స్ రిపోర్టు దాఖలు చేసింది. తిరువనంతపురం గ్రూప్ అసిస్టెంట్ కమిషనర్ ఎస్ఆర్ సజిన్ సహా ఈ వ్యవహారంలో పాల్గొన్న వారందరిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని విజిలెన్స్ నివేదిక పేర్కొంది.
పురాతనమైన దేవి ఆభరణాలు వలియశాలలోని ఒక స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. దేవస్థానం అధికారులు పండుగల సమయంలో వాటిని బయటకు తీసి, తర్వాత అదే స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరుస్తుంటారు.
విధులు అప్పగించడంలో భాగంగా, 2021 సెప్టెంబర్ 14న స్ట్రాంగ్‌రూమ్‌ను అధికారులు తెరిచారు. తిరువాభరణంలో కొన్ని కనిపించకుండా పోయినట్టు గుర్తించారు. చోరీకి ఇన్‌ఛార్జ్ అధికారి బాధ్యత వహించాలని టీడీబీ విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. ఆరోపణలు నిజమేనని, దొంగతనానికి గురైన వస్తువులు ఎంతో విలువైనవని విజిలెన్స్ గుర్తించింది.
తిరువనంతపురం గ్రూప్ అసిస్టెంట్ కమిషనర్ ఎస్ఆర్ సజిన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిఫార్సు చేసింది. అంతేకాకుండా, ఆ రోజు వలియశాలలో విధులు నిర్వహిస్తున్న మరో ముగ్గురు టీడీబీ అధికారులు ప్రోటోకాల్‌ను పాటించకుండా నిర్లక్ష్యం చేశారని, వారి కుట్రతోనే చోరీ జరిగిందని గుర్తించారు. వలియశాల స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన ఆభరణాలన్నింటినీ తనిఖీ చేయాలని తిరువాభరణం కమిషనర్‌ను ఆదేశించారు.
Source: Hindupost





