News

కేంద్ర ప్రభుత్వం అధికార పరిధి మేరకే జడ్జీల నియామకం – కేంద్ర న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు వెల్లడి

677views

న్యాయమూర్తుల నియామకంలో కేంద్ర అధికార పరిధుల్లోకి ఇతర వ్యవస్థలను చొరబడనివ్వమని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ప్రభుత్వం తన పరిమితుల్లో ఉంటూనే ఇతర వ్యవస్థలూ వాటి హద్దుల్లో అవి ఉండేలా చూస్తుందని తెలిపారు. తాము నిర్ణయించిన వ్యక్తినే జడ్జిగా నియమించాలని ఎవరూ ప్రభుత్వాన్ని బలవంత పెట్టలేరని పేర్కొన్నారు. వివిధ వర్గాల ద్వారా అందిన, సేకరించిన సమాచారం ఆధారంగా, వ్యక్తులకున్న సమర్థతలను, అర్హతలను పరిశీలిస్తామన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల జీతాలు, సర్వీసు నిబంధనల సవరణ బిల్లు – 2021పై రాజ్యసభలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

“జడ్జిల నియామకాలలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాల్లో పారదర్శకత, జవాబుదారీతనం లోపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఖాళీల భర్తీలో తీసుకురాదలచిన మార్పులపై ముసాయిదా ప్రతిని సుప్రీంకోర్టు ముందుంచాం” అని కిరణ్ రిజిజు వెల్లడించారు. దానిపై సుప్రీంకోర్టు అభిప్రాయం వెల్లడయ్యే వరకూ ఎలాంటి వ్యాఖ్యలూ చేయబోమన్నారు. జడ్జి పోస్టుకు ఒక వ్యక్తి పేరును రెండోసారి కూడా కొలీజియం సిఫార్సు చేస్తే 3-4 వారాల్లో ప్రభుత్వం ఆ నియామకాన్ని చేపట్టాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాన్ని ముసాయిదా ప్రతిలో ఇంకా చేర్చలేదని తెలిపారు. ఇలాంటి ప్రతిపాదన ప్రభుత్వానికి ఇబ్బందికరమని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.