గుజరాత్ లోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ అనే క్రిస్టియన్ సంస్థ మతమార్పిడి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ సంస్థను మదర్ థెరిసా స్థాపించారు. మతమార్పిడి వివాదంపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల గృహాల్లో ఉంటున్న బాలికలను క్రైస్తవ మతంలోకి మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. గుజరాత్ మత స్వేచ్ఛ చట్టం, 2003 ప్రకారం, హిందూ మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా, క్రైస్తవ మతం కోసం యువతులను ప్రలోభపెట్టినందుకు వడోదర నగరంలోని బాలల గృహంపై కేసు నమోదు చేయబడింది.
జిల్లా సామాజిక భద్రతా అధికారి మయాంక్ త్రివేది ఫిర్యాదు మేరకు ఆదివారం మకర్‌పురా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మయాంక్ త్రివేది ఇటీవల జిల్లా శిశు సంక్షేమ కమిటీ చైర్మన్‌తో కలిసి మకర్‌పురా ప్రాంతంలో మిషనరీ ఆఫ్ ఛారిటీ నిర్వహిస్తున్న బాలికల పిల్లల గృహాన్ని సందర్శించారు. బాలల గృహాల్లోని బాలికలను క్రైస్తవ మత గ్రంథాలను చదవడానికి, క్రైస్తవ ప్రార్థనలలో పాల్గొనేలా చేస్తూ.. వారిని “క్రైస్తవ మతంలోకి తీసుకెళ్లే” ఉద్దేశ్యంతో ఒత్తిడి చేస్తున్నారని తన పర్యటనలో తేలిందని త్రివేది ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
ఫిర్యాదు ప్రకారం ‘ఫిబ్రవరి 10, 2021 మరియు డిసెంబర్ 9, 2021 మధ్య, హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసే కార్యకలాపాలకు సంస్థ ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించిందని’ అన్నారు. బాలికల మెడలో శిలువలు వేసి క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రలోభపెడుతున్నారని ఫిర్యాదులో తెలిపారు. బాలికలు బైబిల్ ను తప్పక చదవాలని బలవంతం చేస్తున్నారని కూడా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.