
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాశీ విశ్వనాథ్ నడవాను ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించారు. కాశీ సుందరీకరణ పనులు, గంగా నదిని కలుపుతూనిర్మించిన ఈ కారిడార్ ని ప్రధాని మోడీ దేశ ప్రజలకు అంకితం చేశారు. ₹339 కోట్లతో నిర్మించిన ఈ కారిడార్ తొలి దశ పనులను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ”అందరికీ కాశీ విశ్వనాథుడి ఆశీస్సులు ఉంటాయి. కాశీ విశ్వనాథుడి పాదాలకు నమస్కరిస్తున్నా. ఎన్నో ఏళ్లుగా వేచి చూసిన సమయం ఆసన్నమైంది. కాశీలో అడుగుపెడితే అన్ని బంధాల నుంచి విముక్తి లభిస్తుంది. కాశీలో అడుగు పెట్టగానే అంతరాత్మ మేల్కొంటుంది. కాశీ చరిత్రలో ఇవాళ నూతన అధ్యాయం రచించాం. భారత ప్రాచీనతకు, సంప్రదాయానికీ ఈ కొత్త నడవా ప్రతీక. ఈనాటి కార్యక్రమంతో గంగానది ప్రసన్నమైంది” అన్నారు.
కాశీలో మృత్యువు కూడా మంగళమే
”కాశీ విశ్వనాథుడి దర్శనానికి దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. కొందరు వారణాసి అంశాన్ని కూడా రాజకీయం చేశారు. కాశీలో శివుడి ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు. నడవాను ప్రారంభించడం నాకు గర్వకారణం. రాత్రింబవళ్లు కష్టపడిన సీఎం యోగి ఆదిత్యనాథ్ బృందాన్ని అభినందిస్తున్నా. కాశీ.. ప్రేమ పరంపరకు చిరునామా. కాశీలో మృత్యువు కూడా మంగళమే. కాశీలో ప్రతీ జీవిలోనూ ఆ విశ్వేశ్వరుడే కనబడతాడు. కరోనా సమయంలోనూ కాశీలో పనులు వేగంగా జరిగాయి. ఇక్కడి నుంచి ఎంతో మంది స్ఫూర్తి పొందారు. మెగా కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన అందరికీ ధన్యవాదాలు” చెప్పారు.
సుల్తాన్ రాజ్యాలు ఎన్నో వచ్చాయి, పోయాయి….
కాశీ నాగరికత, వారసత్వాన్ని ప్రధాని కొనియాడారు. ఎన్నో సుల్తాన్ రాజ్యాలు వచ్చాయి.. పోయాయి.. కానీ బెనారస్ మాత్రం అలాగే ఉందన్నారు. ”దురాక్రమణదారులు ఈ నగరంపై దాడి చేశారు.. నాశనం చేసేందుకు ప్రయత్నించారు. ఔరంగజేబు దురాగతాలకు చరిత్రే సాక్షిగా నిలుస్తుంది. కత్తితో నాగరికతను మార్చేందుకు, మతోన్మాదంతో సంస్కృతిని అణిచివేసేందుకు ప్రయత్నించారు. కానీ ఈ నేల మిగతా ప్రపంచానికి విభిన్నమైనది. ఇక్కడ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వస్తే.. మరాఠా యోధుడు శివాజీ కూడా అవతరించాడు” అని అన్నారు.
ఆత్మనిర్భర్ భారత్, స్వచ్ఛత, నవకల్పనల కోసం ప్రజలంతా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాశీలో అభివృద్ధి కారిడార్ ని ప్రారంభించిన ప్రధాని.. ఈ పనులు దేశానికి సరికొత్త దిశను, భవిష్యత్తును చూపిస్తాయన్నారు. కాశీ పుణ్యక్షేత్రం ప్రాచీన, నవభారత సమ్మేళనమని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు భారీ సంఖ్యలో సాధువులు పాల్గొన్నారు.
గంగా స్నానం

అంతకముందు ప్రధాని కాల భైరవ ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో కాశీ వీధుల వెంబడి వెళ్తున్న ఆయనపై అక్కడి ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. పూలు చల్లుతూ, కరతాళ ధ్వనులు చేస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని గంగా నదిలో స్నానమాచరించారు. కాషాయ వస్త్రాల్లో ఉన్న ఆయన కలశంతో పుష్పాలు వదిలారు.
సామాన్యుడి కానుక స్వీకరించిన ప్రధాని

గంగా నదిలో పుణ్యస్నానమాచరించిన అనంతరం ప్రధాని మోడీ భారీ భద్రత నడుమ ప్రధాన దేవాలయానికి వెళ్తుండగా.. ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. కాషాయ వస్త్రాల్లో ఉన్న ఓ వ్యక్తి తాను తెచ్చిన కానుకలు అందించేందుకు ప్రయత్నించారు. భద్రతా కారణాల దృష్ట్యా సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. మోడీ వాటిని తనకు అందించాలని వారికి చెప్పారు. అక్కడే కారు ఆపించి, ఆ వ్యక్తి తెచ్చిన తలపాగా, కాషాయ వస్త్రాన్ని స్వీకరించారు. భద్రతా వలయం లోపలికి వచ్చి ఆ వ్యక్తే స్వయంగా వాటిని ప్రధానికి అందించారు. అనంతరం ప్రధాని కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం బయట ప్రాంగణంలో ఒక మొక్క నాటారు.
నిర్మాణ రంగ కార్మికులపై పూలు చల్లిన ప్రధాని

ప్రత్యేక పూజల అనంతరం ప్రధాని నిర్మాణ రంగ కార్మికులతో ముచ్చటించారు. నడవా నిర్మాణంలో పాల్గొన్న వారిపై పూలు చల్లి సన్మానించారు. అనంతరం వారితో గ్రూప్ ఫొటో దిగారు. కొద్దిసేపు వారితో ముచ్చటించి సభా వేదిక వద్దకు చేరుకున్నారు.





