
ఢాకా: హిందువులపై దాడులకు సంబంధించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో 71 కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసినందుకు 450 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గత ఐదు రోజుల్లో పూజ వేదికలు, దేవాలయాలు, హిందూ గృహాలు, వ్యాపారాలు, దుర్గా పూజలపై దాడులు జరిగిన విషయం విదితమే. అంతేకాకుండా సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసినందుకు 450 మందిని అరెస్టు చేసినట్టు ఢాకా ట్రిబ్యూన్ నివేదించింది. 71 కేసులు పెట్టినట్టు పోలీసు ప్రధాన కార్యాలయ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఎఐజి) ఎండీ కమ్రుజ్జామన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
విచారణ కొనసాగుతున్న దృష్ట్యా అరెస్టులు, కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఆదివారం రాత్రి, రంగ్‌పూర్‌లోని పిర్గంజ్ ఉపజిల్లాలోని హిందూ గ్రామాలపై ముస్లింలు దాడి చేశారు. ఈ దాడిలో కనీసం 20 ఇళ్లు దగ్ధమయ్యాయని ఢాకా ట్రిబ్యూన్ నివేదించింది. అక్టోబర్ 13 న కుమిల్లాలోని ఒక పూజ మండపంలో ఖురాన్‌ను అవమానపరిచినట్టు ఆరోపణలు రావడంతో కొన్ని రోజులుగా బంగ్లాదేశ్‌లో మతపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇది దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో హింసను ప్రేరేపించింది.
Source: Organiser





