News

అస్పృశ్యత లేని సమాజం కోస‌మే మొల‌కెత్తిన ‘మాలపల్లి’

837views
  • ఘ‌నంగా నూరేళ్ళ మాల‌ప‌ల్లి న‌వ‌ల సాహిత్య గోష్ఠి

గుంటూరు: ఉన్నవ లక్ష్మీనారాయణ 1921లో స్వాతంత్య్ర ఉద్యమ సందర్భంగా రాయవేలూరు జైలులో ఉన్నప్పుడు ” మాలపల్లి” నవలను రాశారు. జైలు అధికారుల కళ్ళు కప్పి ఆ పుస్తకం బయటకు వచ్చింది. నాలుగు భాగాలుగా అచ్చయింది. ఆ నాటి సామాజిక పరిస్థితులు వివరంగా ఈ నవలలో వివరంగా చిత్రీకరించార‌ని ప‌లువురు వ‌క్త‌లు పేర్కొన్నారు. ఏపీలోని గుంటూరు, హిందూ ఫార్మసీ కళాశాల ప్రాంగణంలో 16 అక్టోబర్ సాయంత్రం సమరసత సాహిత్య వేదిక ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో “నూరేళ్ళ మాలపల్లి నవల” పై సాహిత్య గోష్ఠి జరిగింది.

ఈ సంద‌ర్భంగా వ‌క్త‌లు మాట్లాడుతూ… అస్పృశ్యత ఎదుర్కొంటున్న ప్రజల కష్టాలు, క్రైస్తవ మత ప్రచారం, మార్పిడి కార్యక్రమాలు, రష్యా విప్లవం ప్రభావం, గాంధీజీ నేతృత్వంలో జరుగుతున్న స్వాతంత్య్ర ఉద్యమం, అస్పృశ్యత నిర్మూలన…వంటి నిర్మాణాత్మక ఉద్యమాలు.. ఇవన్నీ వివిధ పాత్రల ద్వారా “ఉన్నవ” వారు చిత్రీకరించార‌న్నారు. కుల అసమానతలు, అస్పృశ్యత లేని సమ సమాజం ఏర్పడాలని ఉన్నవ వారి అంతిమ ఆశయం. ఇది గాంధేయ మార్గంలోనే ఏర్పడుతుందని వారి పరిపూర్ణ విశ్వాసమ‌ని, ఉన్నవ వారు ఎప్పుడూ, ఎక్కడా హింసా మార్గాన్ని సమర్ధించలేదని తెలిపారు. ఎస్సీ వర్గాల ఉన్నతే మా ఉద్దేశం అన్న ఆంగ్లేయ క్రైస్తవ ప్రభుత్వం ఎందుకు రెండుసార్లు ఈ నవలను నిషేధించింది? అని ప్ర‌శ్నించారు. ఎట్ట‌కేల‌కు రాజగోపాలాచారి చొరవతో 1936లో ఈ నవలపై గల నిషేధం తొల‌గిపోయింద‌ని, కుల అసమానతలు, అస్పృశ్యత లేని సమ సమాజం ఏర్పడాలని కోరుకునే వారందరూ ఈ నవలను ఎంతో ఓపికగా చదవాలి… ఒక సారి కాదు, పలు దఫాలు చదవాల‌ని వారు కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, డాక్ట‌ర్ వ‌డ్డి విజయ సారథి(జాగృతి వారపత్రిక మాజీ సంపాదకులు), డాక్ట‌ర్ రంగనాయకమ్మ(శారదా నికేతన్ మాజీ ప్రిన్సిపాల్), ఆచార్య కృష్ణారావు(ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం), ఆచార్య పి.వి.సుబ్బారావు(Retd.HOD, PR కళాశాల, చిలకలూరి పేట), జూపూడి రంగరాజు సభలో ప్రసంగించారు. అయినాడ దుర్గాప్రసాద్,(రాష్ట్ర కన్వీనర్) సభను నిర్వహించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి