News

చార్‌ధామ్‌ యాత్రపై పరిమితుల్లేవ్‌

485views
  • కొత్త మార్గదర్శకాలు హైకోర్టు జారీ

ఉత్తరాఖండ్‌: చార్‌ధామ్‌ యాత్రపై పరిమితులను ఎత్తివేస్తూ ఉత్తరాఖండ్‌ హైకోర్టు నిర్ణయం తీసుకోవడంతో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. యాత్రికుల సంఖ్యలో ఎలాంటి పరిమితులు లేవని.. కానీ దర్శనాల కోసం తప్పనిసరిగా చార్‌ధామ్‌ బోర్డు పోర్టల్‌లో వివరాలను నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి ఇకపై పోర్టల్‌ నుండి యాత్ర ఇ-పాస్‌ అవసరం లేదని వెల్ల‌డించింది. చార్‌ధామ్‌ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్యపై రోజువారీ పరిమితిని ఎత్తివేయాలని, ఇది సాధ్యంకాని పక్షంలో మరింత మందిని అనుమతించాలని కోరుతూ కొద్దిరోజుల క్రితమే ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు ను ఆశ్రయించింది. దీనిపై కోర్టు స్పందిస్తూ రోజువారీ యాత్రికులపై పరిమితులను ఎత్తివేసింది.

ఇప్పటివరకు బద్రీనాథ్‌కు రోజుకు వెయ్యి మంది భక్తులు, కేదార్‌నాథ్‌కు 800, గంగోత్రికి 600, యమునోత్రికి 400 మందికి మాత్రమే అనుమతి ఉంది. కాగా ఈ ఆంక్షలు సడలించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవరణ దరఖాస్తు దాఖలు చేసింది. ఇప్పటికే ఆలస్యంగా ప్రారంభమైన ఈ యాత్ర నవంబరు మధ్య వరకే కొనసాగుతుందని, ప్రస్తుతం భక్తుల సంఖ్యపై పరిమితి కారణంగా యాత్రికులపై ఆధారపడి ఉన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోందని రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది.

కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో నిబంధనలు సడలించాలని కోరింది. దీనిపై కోర్టు స్పందిస్తూ రోజువారీ పరిమితులను ఎత్తివేసింది. దీంతో ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ తీసుకున్న ధ్రువపత్రం లేదా 72 గంటల్లోగా తీసుకున్న కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టును యాత్రికులు అందించాలని పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి