
-
భద్రతా దళాలపై ఆక్రమణదారుల దాడి
-
ఆత్మరక్షణ కోసం పోలీసుల కాల్పులు
-
ఇద్దరి మృతి, పలువురికి తీవ్ర గాయాలు
దరాంగ్: అసొంలోని దరాంగ్ జిల్లా, ధోల్పూర్ గోరుఖుతి ప్రాంతం రణ రంగంగా మారింది. ధోల్పూర్ గోరుఖుతి ప్రాంతంలో ఏళ్ళతరబడి ప్రభుత్వ భూముల్లో తిష్ఠ వేసిన ఆక్రమణదారులను ఖాళీ చేయమని చెప్పేందుకు గురువారం వెళ్ళిన పోలీసులపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు కూడా ఆత్మరక్షణార్థం ఎదురు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

రాష్ట్ర వ్యవసాయ ప్రాజెక్టుకు చెందిన భూమి నుండి అక్రమ ఆక్రమణదారులను తరిమికొట్టడానికి భద్రతా సిబ్బంది బృందం ఆ ప్రాంతానికి వెళ్లిన సమయంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్నప్పుడు, వేలాది మంది స్థానికులు ఎదురుదాడికి దిగారు.
తొలగింపు డ్రైవ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అస్సాం క్యాబినెట్ గతంలో ఆక్రమణదారుల నుండి భూమిని పూర్తిగా స్వాధీనం చేసుకొని రాష్ట్ర వ్యవసాయ ప్రాజెక్టుగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ ఘటనపై అసోం ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది.
Source: Vskassam





