
-
విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
ప్రయాగ్‌రాజ్: అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని బంగాబరి మఠంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందం, ప్రత్యేక పోలీసు బృందం.. మహంత్ మృతిపై దర్యాప్తు చేపట్టింది.
మహంత్ తన గదిలో ఉరి వేసుకుని మృతి చెందినట్టుగా కనిపించారని అహ్మదాబాద్ ఎస్పీ దినేశ్ కుమార్ తెలిపారు. అయితే.. దీని గురించి ఇంకా ఎలాంటి విషయాలు వెల్లడిరచలేదు. మఠంలోపలికి ఎవరూ వెళ్లేందుకు అధికారులు అనుమతించటం లేదు. మహంత్ నివాసంలో పోలీసులు ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆయన శిష్యుడు ఆనంద్ గిరి పేరును ప్రస్తావించినట్టు పోలీసులు తెలిపారు. ‘ఎంతో గౌరవంతో నేను జీవించాను. అవమానం జరిగాక నేనిక బతకలేను. నేను ఆత్మహత్యకు పాల్పడుతున్నాను’ అని లేఖలో మహంత్ నరేంద్ర గిరి పేర్కొన్నారని పోలీసులు వెల్లడించారు.
ఇది కచ్చితంగా హత్యే: శిష్యులు
ఇతరులను ఎంతో ప్రోత్సహించే నరేంద్ర గిరి వంటి వ్యక్తి ఆత్మహత్య ఎలా చేసుకుంటారని మహంత్ శిష్యులు ప్రశ్నిస్తున్నారు. ఆయన మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసులు మహంత్ ఆత్మహత్య లేఖ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అందులో ఉన్నది నరేంద్ర గిరి చేతిరాతేనా లేదా ఇంకెవరిదైనా అయ్యుంటుందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మంగళవారం నరేంద్ర గిరి భౌతిక కాయానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మహంత్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను ఎంతో బాధించిందని ట్వీట్ చేశారు. దేశంలోని వివిధ అఖాడాలను ఐక్యం చేయడంలో నరేంద్ర గిరి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక సంప్రదాయాలకు అంకితమైన ఆయన సేవలందించారని తెలిపారు.





