
న్యూఢిల్లీ: తాలిబాన్లు వశపరుచుకున్న ఆఫ్ఘనిస్తాన్‌కు విమాన రాకపోకలు సాగించేందుకు ఏ విమానయాన సంస్థ కూడా ముందుకు రావడం లేదు. అయితే, తాలిబాన్లతో తమకున్న అనుబంధాన్ని లోకానికి తెలుపుతూ పాకిస్తాన్‌కు చెందిన ఓ విమానం కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ల్యాండ్ అయింది. తాలిబాన్లు అధికారం చేపట్టాక కాబూల్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తొలి అంతర్జాతీయ విమానంగా పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ గుర్తింపు తెచ్చుకుంది. విమానంలో 10 మంది వరకు ఉంటారని మీడియా సంస్థలు తెలిపాయి. వీరిలో చాలా మంది విమాన సిబ్బందే ఉండొచ్చని అభిప్రాయపడిరది.
గత వారాంతంలో పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్తాన్‌కు రెగ్యులర్‌గా కమర్షియల్ విమానాలను నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చెప్పినట్టుగానే పాక్ నుంచి తొలి విమానం కాబూల్‌కు చేరుకుంది. కాగా, కాబూల్ విమానాశ్రయం మునుపటిలా లేదు. ఇటీవల చోటు చేసుకున్న ఘటనలకు చాలా వరకూ దెబ్బతింది. ఖతార్, ఇతర దేశాల నుండి సాంకేతిక సహకారంతో తాలిబాన్లు విమానాశ్రయాన్ని పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్నారు.
ఇస్లామాబాద్ నుండి పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌వేస్(పిఐఎ) ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న ఎఎఫ్‌పి జర్నలిస్ట్ మాట్లాడుతూ ‘విమానంలో ఎవరూ లేరు, దాదాపు 10 మంది ప్రయాణికుల కంటే ఎక్కువ మంది సిబ్బంది ఉండవచ్చు.’ అని చెప్పుకొచ్చారు. మరో వైపు ప్రజలు దేశం విడిచిపెట్టి వెళ్లవద్దని తాలిబాన్లు కోరుతూ ఉన్నారు. మరో వైపు సరైన పత్రాలు కలిగిన ఆఫ్ఘన్లు దేశాన్ని స్వేచ్ఛగా విడిచి వెళ్లేందుకు అనుమతిస్తామని పదేపదే వాగ్దానం చేస్తున్నారు.
వాణిజ్య విమానాలు పునఃప్రారంభవమవడంతో ఆఫ్ఘన్‌ను వీడడానికి కొందరు ప్రజలు ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు. ఇక ఖతార్ ఎయిర్‌వేస్ గత వారం కాబూల్ నుండి అనేక చార్టర్ ఫ్లైట్‌లను నడిపింది. తరలింపులో తప్పిపోయిన విదేశీయులు, ఆఫ్ఘన్‌లను ఎక్కువగా తీసుకువెళ్లారు. ఈ నెల మూడోతేదీన ఆఫ్ఘన్ ఎయిర్‌లైన్ దేశీయ సేవలను తిరిగి ప్రారంభించింది. ఇక పాక్ విమానాలు తిరుగుతూ ఉండడంతో ఇస్లామాబాద్‌కు తిరిగి వెళ్లేందుకు దాదాపు వంద మంది ప్రయాణికులు వేచి ఉన్నట్టు తెలుస్తోంది.
Source: NationalistHub





