
-
చిన్నారుల ఉసురుపోసుకున్న ప్రభుత్వం, పోలీసులు
-
నిప్పుచెరుగుతున్న గణపతి భక్తులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హిందువులపై ఎందుకీ వివక్ష? అని రాష్ట్రంలోని వినాయకుడి భక్తులు నిప్పులుచెరుగుతున్నారు. కరోనా పేరిట దేవుళ్ళ పూజలకు విఘాతాలు కలిగించడం ప్రభుత్వానికి మంచిది కాదని వారు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవానికి ఆది నుంచి అడ్డంకులు ఏర్పడడం విదితమే. ఈ నేపథ్యంలో ఏదో విధంగా పూజలు చేసుకున్న భక్తులకు చివరికి నిమజ్జన సమయంలో ఇక్కట్లు తప్పడం లేదు. పోలీసులు వివిధ ఆంక్షల పేరుతో అడ్డుకుంటున్నారు.. ఇతర మతాల వారు, రాజకీయ నాయకులు వేల మందితో కార్యక్రమాలు చేస్తుంటే.. వారికి లేని నిబంధనలు హిందూ పండుగలకు ఎందుకు ఆంక్షలు విధించారంటూ పలు హిందూ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
డ్రమ్స్‌కు అనుమతి లేదట!
కర్నూలు జిల్లా ఆత్మకూరులో చేపట్టిన వినాయక నిమజ్జన శోభాయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డ్రమ్స్ వాయిద్యాల మధ్య యువకులు, చిన్నారుల నృత్యాలతో శోభయాత్ర ప్రారంభం కాగా…డ్రమ్స్‌కు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. శోభాయాత్రను ఆపేసి యువకులు నిరసనకు దిగారు. కొద్దిసేపు తర్వాత పోలీసులు దిగిరావటంతో యువకులు శాంతించారు. శోభాయాత్ర తిరిగి ఉత్సహంగా కొనసాగింది.
సీఎం తండ్రి వర్ధంతికి వర్తించని కొవిడ్ నిబంధనలు.. వినాయక నిమజ్జనానికి వర్తిస్తాయా?
గూడూరు నగర పంచాయతీలో ఆదివారం వినాయక నిమజ్జనంలో ఉద్రిక్తత కొనసాగింది. నిమజ్జనానికి డీజే అనుమతి లేదని పోలీసులు తెలపడంతో బస్టాండ్ కూడలి వద్ద పెద్ద ఎత్తున స్థానికులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ.. సీఎం తండ్రి వర్ధంతికి వర్తించని కొవిడ్ నిబంధనలు.. వినాయక నిమజ్జనానికి వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ఉదయం నిరసన ప్రారంభించారు. పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను చెదరగొట్టారు.
ఆలూరు వినాయక నిమజ్జనంలో డిజే అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిమజ్జనానికి వెళ్లకుండా నిలిపేశారు. మూడు రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన యువకులు… డీజేతో నిమజ్జనానికి బయలు దేరగా పోలీసులు అడ్డుకున్నారు.
ఊరేగింపులకు అడ్డుపుల్ల
గుంటూరు జిల్లా, గరికపాడులో వినాయక ఊరేగింపును పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. డప్పులతో ఊరేగింపుగా వెళ్తున్న విగ్రహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మహిళలు రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిన్న వైకాపాకు చెందిన నాయకులు డప్పులతో రాత్రి వరకు ఊరేగింపు చేశారని… తాము చేస్తే తప్పు ఏముందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అనంతపురంలో గణపతికి ముస్లిం పూజలు
అనంతపురం జిల్లా హిందూపురంలో వినాయక ఉత్సవాల్లో భాగంగా విశ్వ సేన వినాయక సేవా సమితి ప్రతి సంవత్సరం వినాయకుని పూజలకు ముస్లిం సోదరులను ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. వారి ఆహ్వానం మేరకు ముస్లిం సోదరులు పాల్గొని.. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు. గణనాథుడి పూజ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని పలువురు ముస్లింలు అభిప్రాయం వ్యక్తం చేశారు.





