News

ఆలయ భూమికి సర్కారు ఓనర్‌ కాదు!

659views
  • దేవుడే యజమాని, పూజారి నిర్వాహకుడే…

  • సుప్రీంకోర్టు కీలక తీర్పు

దిల్లీ: ఆలయాల భూములకు ప్రభుత్వం లేదా కలెక్టర్లు యజమానులు కారని, ఆ భూమికి ఆ దేవుడే ఓనర్‌ అని సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. పూజారులు నిర్వాహకులని పేర్కొంది. అయితే, పూజారులకు ఆ భూములపై ఎలాంటి యాజమాన్యపు హక్కులు ఉండవని కోర్టు స్పష్టంచేసింది. రెవెన్యూశాఖ రికార్డుల్లోని యజమాని, అనుభవదారును సూచించే గడుల్లో సంబంధిత దేవుడు/దేవత పేరు ఉండాలని తెలిపింది. ప్రభుత్వం, ప్రభుత్వం తరఫున కలెక్టర్లను ఆలయాల ఆస్తులకు యజమానులుగా పేర్కొనరాదని జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది.

మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం రెండు నోటిఫికేషన్లు

దేవాలయాల భూములకు యజమానులుగా పూజారుల పేర్లను చేర్చడంపై అభ్యంతరం తెలుపుతూ, వారి పేర్లను రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించాలని ఆదేశిస్తూ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం రెండు నోటిఫికేషన్లు జారీచేసింది. పూజారుల పేర్ల స్థానంలో స్థానిక కలెక్టర్లను చేర్చాలని తెలిపింది. ఈ నోటిఫికేషన్లను మధ్యప్రదేశ్‌ హైకోర్టు కొట్టివేయడంతో ఆ రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలుచేసింది. ఆలయాల భూముల అక్రమ విక్రయాలను నిరోధించేందుకు నోటిఫికేషన్లు జారీ చేసినట్టు తెలిపింది. కేసును విచారించిన ద్విసభ్య ధర్మాసనం తరఫున జస్టిస్‌ హేమంత్‌ గుప్తా తీర్పు రాశారు.

ఇటువంటి వివాదాలపైనే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను, ప్రత్యేకించి గ్వాలియర్‌ చట్టాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ‘ఆలయ ఆస్తుల నిర్వహణను మాత్రమే పూజారికి అప్పగించారు. ఆయనకు భూమి సాగుదారు హోదా కల్పించలేదు కాబట్టి ఆయన కౌలుదారు కాదన్నది వాస్తవం. ఆలయ భూమి అనుభవదారు సంబంధిత ఆలయంలో ఉండే దేవుడు/దేవత మాత్రమే.

భగవంతుడి తరఫున విధులు

సాగు కోసం సేవకులను లేదా మేనేజరును నియమించినప్పటికీ వారు భగవంతుడి తరఫునే విధులు నిర్వహిస్తారు. అందువల్ల అనుభవదారు పేరును సూచించే రెవెన్యూ రికార్డుల్లో మేనేజర్‌ లేదా పూజారి పేరును చేర్చనవసరం లేదు. అధికారిక రికార్డుల్లో యజమాని/అనుభవదారు స్థానంలో దేవుడి పేరుకు బదులుగా ఉన్న పూజారుల పేర్లను తొలగించాలని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయడం సబబే’’ అని తీర్పులో పేర్కొన్నారు. అదే సమయంలో పూజారుల పేర్లు తొలగించి ఆ స్థానంలో కలెక్టర్లను చేర్చాలన్న నిర్ణయాన్నీ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమోదించలేదు. ఒకవేళ కలెక్టర్ల పేర్లను మేనేజర్లుగా చేర్చాలంటే సంబంధిత ఆలయాలు రాష్ట్ర ప్రభుత్వానివై ఉంటేనే చెల్లుబాటు అవుతుందని పేర్కొంది.

Source : Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి