
మెక్సికో: మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. పసిఫిక్ తీరానికి సమీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సీస్మోలాజికల్ సర్వీస్ తెలిపింది. ఈ ప్రకంపనలతో చాలా భవనాలు కొద్దిసేపు ఊగినట్లు అధికారులు తెలిపారు. గెరెరో రాష్ట్రంలోని అకాపుల్కో బీచ్ రిసార్ట్‌కి ఆగ్నేయంగా 11 కిలోమీటర్లు (ఏడు మైళ్లు) దూరంలో ఉన్నట్లు సీస్మోలాజికల్ సర్వీస్ తెలిపింది. ముందుగా నైరుతి మెక్సికోలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
రాజధానిలోని భవనాలు చిగురుటాకుల్లా వణికినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా.. భారీ భూకంపం సంభవించడంతో ప్రజలు భయంతో ఇళ్లల్లోనుంచి పరుగులు తీశారు.
కాగా.. 1985 సెప్టెంబరు 19వతేదీన సంభవించిన తీవ్ర భూకంపం వల్ల 10వేల మందికిపైగా మరణించగా, వందలాది భవనాలు నెలమట్టమయ్యాయి. 2017లో సంభవించిన భూకంపంలో 370 మంది మరణించారు.





