
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల దురాక్రమణలు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలను వారు హస్తగతం చేసుకున్నారు. తాజాగా దేశంలోనే రెండో అతిపెద్ద నగరమైన కాందహార్ సహా హెరత్, ఘాజ్నీ, హెల్మండ్, లోగర్ వంటి ప్రముఖ నగరాలను ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటివరకూ మొత్తం 15 ప్రావిన్షియల్ రాజధానులను ఆక్రమించగా.. దేశ్యవాప్తంగా మూడింట రెండొంతుల కంటే ఎక్కువే ప్రాంతాలు తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయాయి. దేశ దక్షిణభాగం మొత్తం ఇప్పుడు వారి చేతుల్లోనే ఉంది.
ఘాజ్నీ, లోగర్ వంటి నగరాలను కోల్పోవడం అఫ్గాన్ సేనలకు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి. కాబుల్-కాందహార్ హైవేలో ఉన్న ఘాజ్నీ నగరం… దేశ రాజధానిని, దక్షిణాది రాష్ట్రాలనూ కలుపుతుంది. ఈ నగరం తాలిబన్ల చేతిలోకి వెళ్లడంతో అఫ్గాన్ సైనికుల రవాణాకు కష్టతరమవుతుంది. ఇక లోగర్ ప్రావిన్స్ కాబూల్‌కు కేవలం 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పటివరకు తాలిబన్లు కాబూల్‌ను నేరుగా లక్ష్యం చేసుకోనప్పటికీ ఆ నగరానికి చుట్టుపక్కల ప్రాంతాల్లోకి చొచ్చుకురావడంతో పరోక్షంగా కాబూల్ చుట్టుముట్టిన పరిస్థితి తలెత్తింది.
అఫ్గాన్ అంతా మా నియంత్రణలోకే..
ఇదిలా ఉండగా.. మరో వారం రోజుల్లోపే కాబూల్ సహా దేశం మొత్తాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటామని తాలిబన్లు చెబుతున్నారు. హింస, విధ్వంసం సృష్టించడం తమ ఉద్దేశం కాదని ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఏ విదేశీ మిషన్లపైనా, ఎన్జీవోలపైనా దాడులు చేయడం లేదన్నారు.
నేడు రేపో అధ్యక్షుడి ప్రకటన..
మరోవైపు తాలిబన్లతో సంధి కుదుర్చుకునేంకు అఫ్గాన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. హింసను పక్కనబెడితే అధికారాన్ని పంచుకునేందుకు సిద్ధమేననే ప్రతిపాదనను వారికి పంపింది. అయితే దీనిపై తాలిబన్లు ఇంకా స్పందించలేదు. కాగా.. దేశంలో ప్రస్తుత పరిస్థితులపై అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ నేడు లేదా రేపు కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.





