News

బీజేపీ వినుకొండ పట్టణ అధ్యక్షుడు రమేశ్‌ పై హత్యాయత్నం

633views

గుంటూరు జిల్లాలోని వినుకొండ పట్టణ బీజేపీ అధ్యక్షుడు మేడం రమేష్‌పై హత్యాయత్నం జరిగింది. శుక్రవారం మార్నింగ్ వాకింగ్‌కు ఆయన వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. ఆయన చేతికి, తలకు తీవ్ర గాయలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రమేష్ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడి చేయించింది మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అని రమేష్ చెబుతున్నారు. సురేష్ మహాల్ రోడ్డులో ఆక్రమణ తొలగింపులో శివాలయం కూల్చివేశారు. దీనిపై రమేష్ న్యాయపోరాటం చేశారు. విస్తరణలో భాగంగా శివాలయాన్ని తొలగించినట్లు మున్సిపల్ అధికారులు అప్పట్లో చెప్పారు. శివాలయం తొలగింపుపై బీజేపీ, జనసేన కలిసి న్యాయపోరాటం చేశాయి. ఈ క్రమంలో వినుకొండ కమీషనర్ శ్రీనివాస్‌పై చర్యలు తీసువాలని ఉన్నతాధికారులకు బీజేపీ నేత రమేష్ ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు జోక్యంతో మధ్యలోనే విస్తరణ పనులు ఆగిపోయాయి. ఈ క్రమంలోనే తనపై దాడి జరిగిందని రమేష్ అనుమానం వ్యక్తం చేశారు.

ఈ ఘటనను ఏపీ బీజేపీ అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో భౌతిక దాడులు, హత్యాయత్నాల ద్వారా భయపెట్టాలనుకోవడం సరికాదని అన్నారు. ప్రజాసమస్యలపై నిరంతరం అధికారులను, అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్న మేడం రమేష్ పై, వ్యక్తిగతంగా కక్షగట్టి దాడులతో బయపెట్టాలి అనుకోవటం అవివేకమైన చర్యగా సోము వీర్రాజు అభివర్ణించారు. రమేష్ కు అవసరమైన మెరుగైన వైద్య సేవలు అందించాలని సోము వీర్రాజు ఆదేశించారు. రాష్ట్రంలో పార్టీ శ్రేణులను రక్షించుకునేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగుతానని, జిల్లా యస్పీ ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

బీజేపీ నేత జీవీఎల్ న‌ర‌సింహారావు ఈ దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు. బాధితుడు రమేశ్ గారితో, నరసరావుపేట జిల్లా అధ్యక్షుడు సైదిరెడ్డిగారితో, పట్టణ అధ్యక్షుడు రామకృష్ణతో మాట్లాడాను. శివాలయ విధాంశాన్ని వ్యతిరేకించారని మర్డర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోందని జీవీఎల్ పేర్కొన్నారు. ఒళ్లంతా గాయాలతో నరసరావుపేట ఆసుపత్రిలో ర‌మేశ్‌ చికిత్స పొందుతున్నారు. ఇనుప రాడ్లతో, కర్రలతో దాడి. తలపై ఎనిమిది కుట్లు, చేతికి ఆపరేషన్, కాళ్లంతా దెబ్బలు. పట్టపగలు దాడి చేస్తే పోలీసులు నిద్రపోతున్నారా? అధికారులే మర్డర్ కు స్కెచ్ వేశారా? అనే అనుమానం కలుగుతోందని అన్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకపోతే బీజేపీ ఈ ప్రభుత్వ అరాచకాలపైన పోరాటం చేస్తుంది. ఈ దాడిలో క‌చ్చితంగా వైసీపీ స్థానిక నాయకుల, అధికారుల ప్రోద్బలం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందని ఆరోపించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.