
కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనాలో మరోసారి వైరస్ విజృంభిస్తోంది. డెల్టా వేరియంట్ కారణంగా అక్కడ గత కొన్ని రోజులుగా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన డ్రాగన్ ప్రభుత్వం వైరస్ వ్యాప్తి కట్టడికి కఠిన చర్యలు చేపడుతోంది. ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు వారిని ఇంట్లోనే బందీలుగా చేసి అధికారులు బయట నుంచి తాళాలు వేస్తున్నారు. తలుపుల ముందు ఇనుప రాడ్ల పెట్టి ఇంటిని సీల్ చేస్తున్నారు.
పీపీఈ కిట్లలో ఉన్న అధికారులు కొందరు ఇళ్ల ముందు ఇనుపరాడ్లు కొడుతున్న వీడియోలు కొన్ని విబో, ట్విటర్‌లలో వైరల్ అవుతున్నాయి. తాజాగా అక్కడ ఉన్న నిబంధనల ప్రకారం.. ఏ వ్యక్తి అయినా ఒక రోజులో మూడు సార్లు మాత్రమే బయటకు రావాలి. అంతకంటే ఎక్కువ సార్లు బయటకు వచ్చినా.. పదే పదే తలుపులు తెరిచినట్లు ఫిర్యాదులు అందినా.. వెంటనే అధికారులు వారి ఇంటిని చేరుకుని బయటి నుంచి తాళాలు వేస్తున్నారు. అంతటితో ఆగకుండా డోర్ల ముందు X ఆకారంలో ఇనుప రాడ్లు బిగిస్తున్నట్లు తైవాన్ న్యూస్ ఓ కథనంలో పేర్కొంది.
ఇక అపార్ట్‌మెంట్లలో ఎవరికైనా కరోనా సోకినా లేదా.. పాజిటివ్ వచ్చిన వ్యక్తికి కాంటాక్ట్ పర్సన్ అని తేలినా.. ఆ భవనాన్ని రెండు నుంచి మూడు వారాల పాటు పూర్తిగా సీల్ చేస్తున్నట్లు మరికొన్ని కథనాలు తెలిపాయి. అయితే చైనాలో ఇలాంటి కఠిన నిబంధనలు అమలు చేయడం కొత్త కాదు. గతేడాది వుహాన్ నగరంలో కరోనా విజృంభణ సమయంలోనూ ప్రజల ఇళ్లకు అధికారులు తాళాలు పెట్టి వైరస్ వ్యాప్తిని కట్టడి చేశారు.
వుహాన్ నగరంలో వెలుగుచూసి ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారి తిరిగి తిరిగి మళ్లీ చైనాను చేరింది. గత కొన్ని రోజులుగా అక్కడ డెల్టా వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ఏప్రిల్ 9 నాటికి కనీసం 17 ప్రావిన్సుల్లో 143 కొత్త కేసులు వెలుగుచూసినట్లు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. ఇందులో 35 మంది విదేశాల నుంచి వచ్చినవారు కాగా.. 108 స్థానికంగా నమోదైన కేసులే. జియాంగ్జు ప్రావిన్స్‌లో అత్యధిక కేసులు బయటపడ్డాయి.





