
తాలిబన్ల స్థావరాలపై ఆఫ్ఘన్ వైమానిక దాడులతో విరుచుకపడ్డాయి. కాందహార్ లోని జేరాయ్ జిల్లాలో తాలిబన్ల స్థావరాలపై వైమానిక దాడులు జరిపామని, ఆ తరువాత ఘజిని, కాందహార్, హెరాత్, హెల్మండ్, కపినా రాష్ట్రాల్లోని వీరి బేస్ లపై జరిపిన దాడుల్లో 250 మందికి పైగా తాలిబన్లు మరణించారని, 100 మందికి పైగా గాయపడ్డారని ఆఫ్ఘన్ ప్రభుత్వం ట్వీట్ చేసింది. మా దాడుల్లో వందలాది మంది తాలిబన్లు మరణించడమో..గాయపడడమో జరిగిందని మొదట చేసిన ట్వీట్ లో పేర్కొంది. ఆఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా బలగాలు ఉపసంహరణతో తాలిబన్లు దేశంలోని అనేక జిల్లాలను, గ్రామాలను హస్తగతం చేసుకుంటూ వచ్చారు. కాందహార్ విమానాశ్రయంపై రాకెట్లు ప్రయోగించారు. అయితే ఇన్నాళ్లూ కేవలం వారిని వార్ జోన్ లో ఎదుర్కొన్న ఆఫ్ఘన్ బలగాలు ఏకంగా వైమానిక దాడులకు దిగడం విశేషం. తమ దాడుల్లో ధ్వంసమైన తాలిబన్ల స్థావరాల తాలూకు వీడియోను కూడా ఆఫ్ఘన్ ప్రభుత్వం విడుదల చేసింది. గత 24 గంటల్లో ఎంతమంది మృతి చెందింది.. గాయపడింది వివరించింది.





