News

నిబంధనలు ఉల్లంఘించే సామాజిక మాధ్యమాలపై చర్యలు తీసుకునే స్వేచ్ఛ కేంద్రానికి ఉంది – ఢిల్లీ హైకోర్టు

727views

భారత నూతన ఐటీ చట్టాలను పాటించకుండా ఉండేందుకు ట్విటర్‌కు రక్షణ కల్పించలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. నిబంధనలు ఉల్లంఘించే సామాజిక మాధ్యమాలపై చర్యలు తీసుకునే స్వేచ్ఛ కేంద్రానికి ఉందని స్పష్టం చేసింది.

భారత ప్రభుత్వం రూపొందించిన నూతన నిబంధనలను ట్విటర్‌ పాటించడం లేదంటూ న్యాయవాది అమిత్ ఆచార్య దాఖలు చేసిన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు నేడు మరోసారి విచారణ జరిపింది. కొత్త నిబంధనల ప్రకారం.. జులై 6న భారత్‌కు చెందిన వ్యక్తిని తాత్కాలికంగా చీఫ్‌ కాంప్లియెన్స్ అధికారిగా నియమించామని ట్విటర్‌ తెలిపింది. జులై 11న తాత్కాలిక గ్రీవెన్స్‌ అధికారిని, ఆ తర్వాత నోడల్‌ కాంటాక్ట్‌ అధికారిని నియమించనున్నట్లు చెప్పింది. ఈ హోదాల్లో పూర్తిస్థాయి అధికారులను 8 వారాల్లోగా నియమిస్తామని పేర్కొంది.

ట్విటర్‌ వివరణపై స్పందించిన ధర్మాసనం.. ఈ వివరాలతో కూడిన అఫిడవిట్‌ను రెండు వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అంతేగాక, తాత్కాలికంగా నియమించిన అధికారులు కూడా తమ బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. అయితే కొత్త చట్టాలను అమలు చేయనందుకు కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటే మాత్రం తాము ట్విటర్‌కు ఎలాంటి రక్షణ కల్పించలేమని న్యాయస్థానం తెలిపింది.నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని పేర్కొంది. దీనిపై తదుపరి విచారణను జులై 28వ తేదీకి వాయిదా వేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.