News

మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు : వారంలోగా వివరణ ఇవ్వండి : ట్విటర్‌ ఎండీకి యూపీ పోలీసుల నోటీసు

698views

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ భారత విభాగానికి ఎండీగా ఉన్న మనీషా మహేశ్వరికి ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొంతమంది ట్విటర్‌ను ఉపయోగించుకున్నారని.. దీనిపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు లోనీ బోర్డర్‌ పోలీస్‌ స్టేషన్‌లో వివరణను రికార్డు చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
”సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కొంతమంది ట్విటర్‌ను ఉపయోగించుకున్నారు. ట్విటర్‌ సంస్థగానీ, భారత్‌లోని దాని విభాగంగానీ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ విద్వేషపూరితమైన సందేశం వైరల్‌గా మారేందుకు ఆస్కారం ఏర్పడింది” అని మహేశ్వరికి పంపిన నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.

సందేశాన్ని పంపినవారితో పాటు మొత్తం ఎనిమిది మందిని ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. అలాగే ట్విటర్‌ను సైతం ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనడం గమనార్హం. భారత్‌లో కొత్త డిజిటల్‌ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ట్విటర్‌పై కేసు నమోదవడం ఇదే తొలిసారి.

నూతన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) నిబంధనలు పాటించనందుకు ‘సురక్షిత ఆశ్రయం'(సేఫ్‌ హార్బర్‌) అన్న రక్షణ కవచాన్ని ట్విటర్‌ కోల్పోయింది. నూతన నిబంధనల ప్రకారం ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా అధికారులను నియమించాలని పలుమార్లు సూచించినా పట్టించుకోకపోవడంతో కేంద్రం ఈ సౌకర్యాన్ని తొలగించింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవ్యతిరేకమైన సమాచారాన్ని పెడితే తృతీయ పక్షం కింద ట్విటర్‌పై భారతీయ శిక్షా స్మృతి ప్రకారం చర్యలు తీసుకొనే వీలు కలుగుతుంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.