
రాబోయే ఐదేళ్లకు రక్షణ రంగంలో పరిశోధన, ఆవిష్కరణల కోసం దాదాపు రూ.499 కోట్ల బడ్జెట్ మద్దతుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఆమోదం తెలిపారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే లక్ష్యంతో దాదాపు 300 అంకుర సంస్థలు, సూక్ష్మ-చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ), వ్యక్తిగత ఆవిష్కర్తలకు ఆర్థిక సహాయం అందించడానికి ఈ నిధులు ఉపయోగపడతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆయుధాలు, సైనిక ఉత్పత్తుల దిగుమతులను తగ్గించి, భారతదేశాన్ని రక్షణ ఉత్పత్తుల తయారీ కేంద్రంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ నిధులు దోహదం చేయనున్నాయని రక్షణ శాఖ తెలిపింది. ఇందులో భాగంగా ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్-డీడీపీ’ ఆధ్వర్యంలో ‘డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్-డీఐఓ’ ఏర్పాటు చేసి దాని ద్వారా ‘ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్స్‌లెన్స్-ఐడెక్స్’ అమలు చేయనున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది. రక్షణ, ఏరోస్పేస్ రంగంలో స్వావలంబన సాధించడమే ‘ఐడెక్స్-డీఐఓ’ లక్ష్యమని.. దాని కోసమే తాజాగా కేటాయిచిన రూ.499 కోట్ల నిధులను వినియోగించనున్నట్లు తెలిపింది. ఆవిష్కర్తలు డీడీపీతో అనుసంధానమయ్యేందుకు డీఐఓ వారధిగా నిలవనుందని తెలిపింది.



