
సాగు చట్టాలను రద్దు చేయాలంటూ రైతుల పేరుతో కొందరు చేస్తున్న ఆందోళనలకు సంబంధించి రెచ్చగొట్టే విధంగా తప్పుడు సమాచార వ్యాప్తికి పాల్పడే ఖాతాలను తొలగించే అంశంలో… ట్విటర్ వ్యవహరిస్తోన్న తీరుపై కేంద్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. నకిలీ వార్తలు, హింసను ప్రోత్సహించే విధంగా సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం రాజ్యసభలో మాట్లాడుతూ… ఈ వ్యాఖ్యలు చేశారు.
‘మీకు భారత్ లో కోట్ల మంది యూజర్లు ఉన్నారు. మీరు వ్యాపారం చేసుకోవడానికి, ఆదాయం పొందడానికి తగినంత స్వేచ్ఛ ఉంది. కానీ మీరు తప్పకుండా భారత రాజ్యాంగాన్ని అనుసరించాలి. మేం సామాజిక మాధ్యమాలను చాలా గౌరవిస్తాం. ఇవి సామాన్య ప్రజానీకాన్ని శక్తివంతం చేశాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. అయితే నకిలీ వార్తలు, హింసను ప్రేరేపించే విధంగా సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవ్’ అని పార్లమెంట్ వేదికగా ట్విటర్ ను గట్టిగా హెచ్చరించారు. ఈ క్రమంలో ఆయన ఫేస్‌బుక్, యూట్యూబ్, లింక్డిన్ వంటి సంస్థల పేర్లను కూడా ప్రస్తావించారు.
యూఎస్ లో ఒకలా…. భారత్‌లో మరోలా….
బుధవారం ట్విటర్ బ్లాగ్ పోస్టు అనంతరం కూడా కేంద్రం నుంచి ఈ తరహా స్పందనే వచ్చింది. భారత్‌లో పనిచేస్తోన్న ఒక వ్యాపార సంస్థగా అది భారత చట్టాలను గౌరవించాలని స్పష్టం చేసింది. సొంత నియమాలు, మార్గదర్శకాలతో సంబంధం లేకుండా వాటిని పాటించాలని తేల్చిచెప్పింది. ‘చట్టబద్ధంగా ఆమోదించిన ఆదేశాలను భారత్‌లో పనిచేస్తోన్న ఏ వ్యాపార సంస్థ అయినా తక్షణమే పాటించాలి. ఆలస్యం చేస్తే…. వాటికి అర్థం లేకుండా పోతుంది’ అని కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. అలాగే అమెరికా క్యాపిటల్ హిల్ భవనంపై దాడి జరిగినప్పుడు సామాజిక మాధ్యమ సంస్థ తీరుకు…. ప్రస్తుతం వ్యవహరిస్తోన్న తీరు పూర్తి భిన్నంగా ఉందని, ఇది తీవ్ర నిరాశకు గురిచేస్తోందని వ్యాఖ్యానించింది. అంతేగాక, ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోతే… ట్విటర్ ఉన్నతాధికారులు అరెస్టును ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది.





