News

ఎర్రకోటపై దాడి నిందితుడు దీప్ సిద్దూ అరెస్టు

465views

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతుల పేరుతో కొందరు నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంగా గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధానిలో చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. రైతుల పేరుతో గత కొన్ని రోజులుగా ఉద్యమం నడుపుతున్న కొందరు గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై దాడికి పాల్పడ్డారు. దాడి ఘటనలో అభియోగాలు ఎదుర్కొంటూ గణతంత్ర దినోత్సవం నాటి నుంచి కన్పించకుండాపోయిన పంజాబీ నటుడు దీప్ సిద్దూ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. చండీగఢ్, అంబాలా మధ్యలోని జిరాక్ పూర్‌ ప్రాంతంలో ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం దీప్‌ సిద్ధూను అరెస్టు చేసినట్లు డిప్యూటీ కమిషనర్‌ సంజీవ్‌ కుమార్‌ యాదవ్‌ మంగళవారం తెలిపారు.

అయితే జనవరి 26న జరిగిన ఉద్రిక్త పరిస్థితులకు దీప్ సిద్ధూనే కారణమని, రైతులు ఎర్రకోటవైపు వెళ్లేలా ఆయనే రెచ్చగొట్టారంటూ ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా, ఎర్రకోటపై ఖలిస్థాన్ జెండా ఎగురవేసిన సమయంలో సిద్ధూ అక్కడే ఉన్నాడు. జెండాలు ఎగురవేయడాన్ని సమర్థిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టులు కూడా చేశాడు. అల్లర్లకు సిద్ధూనే బాధ్యుడంటూ రైతు సంఘాలు కూడా ఆరోపించాయి. అయితే ఆ తర్వాత నుంచి సిద్ధూ కన్పించకుండా పోయాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీప్ సిద్దూ ఆచూకీ చెప్పినవారికి రూ.లక్ష రివార్డు కూడా ప్రకటించారు.

కాగా…. సిద్దూ అజ్ఞాతంలో ఉన్నప్పటికీ, ఆయన ఫేస్బుక్ లో సిద్ధూ వీడియోలు పోస్ట్‌ అవుతూనే ఉన్నాయ్. అయితే ఆ వీడియోలను విదేశాల్లో ఉంటున్న సిద్ధూ స్నేహితురాలు ఒకరు పోస్ట్‌ చేసినట్లు తెలిసింది. ‘కాలిఫోర్నియాలో ఉంటున్న ఓ స్నేహితురాలితో సిద్ధూ కాంటాక్ట్‌లో ఉన్నారు. సిద్ధూ వీడియోలు చేసి పంపితే.. ఆమె వాటిని సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ చేశారు’ అని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.