
దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించిన బెంగళూరు దాడుల కేసు విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) పురోగతి సాధించింది. ఈ దాడులకు సంబంధించి 17 మంది ఇస్లామిక్ అతివాద సంస్థ సభ్యులను అరెస్ట్ చేసింది.
ఈ ఏడాది ఆగస్టు 11న బెంగుళూరు పరిధిలోని పులకేశినరగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస్ మేనల్లుడు ఫెస్‌క్ లో చేసిన పోస్టుకు నిరసనగా కె.జి హళ్లి పోలీసు స్టేషన్ పరిధిలో ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులు హింసాత్మక దాడులు, పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణను జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దీనిపై విచారణ చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ, ఈ అల్లర్లలో ప్రమేయం ఉన్న 17మంది సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI), పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) కార్యకర్తలను సోమవారం అరెస్టు చేసింది. ఈమేరకు NIA ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.
బెంగళూరులో జరిగిన అల్లర్లకు సంబంధించి ముందస్తుగానే సమావేశాలు ఏర్పాటు చేసి జనాన్ని సమీకరించి హింసను ప్రేరెపించడంతో పాటు, కె.జి హల్లి పోలీసు స్టేషన్ పై దాడి చేసి భారీ నష్టం కలిగించినందుకు గాను ఎస్.డి.పి.ఐ బెంగళూరు జిల్లా అధ్యక్షుడు ఎండి. షరీఫ్, కెజి హళ్లి వార్డ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ అహ్మద్ తో పాటు రుబా వకాస్, షబ్బార్ ఖాన్, షేక్ అజ్మల్ ను విచారించినట్టు NIA తెలిపింది. అదే విధంగా కె.జి హళ్లి పోలీసు స్టేషన్ వద్దకు పెద్ద సంఖ్యలో జనాన్ని సమీకరించారనే కారణంతో ఎస్.డి.పి.ఐ నాగ్వారా వార్డు అధ్యక్షుడు అబ్బాస్ ని మరియు అతని అనుచరులు అజిల్ పాషా, ఇర్ఫాన్ ఖాన్, అక్బర్ ఖాన్ లను NIA విచారించినట్టు తెలిపింది.
ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి సద్దాం, సయ్యద్ సోహెల్, కలీముల్లా అనే నిందితులు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ వంటి సోషల్ మీడియా వేదికలను ఉపయోగించారని, వారు ప్రత్యక్షంగా దాడులలో పాల్గొనడంతో పాటు, అల్లరి మూకలు పోలీస్ స్టేషన్ వద్ద గుమిగూడేలా ప్రేరేపించినట్టు విచారణలో వెల్లడైందని ఎన్.ఐ.ఏ పెర్కొంది. ఈ కేసులో తాము ఇప్పటివరకు 187 మంది నిందితులను అరెస్టు చేశామని, దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని NIA పేర్కొంది.





