News

6జలాంతర్గాములకు త్వరలో బిడ్లు

472views

భారత నౌకాదళం అవసరాల కోసం ఆరు జలాంతర్గాములను రూ.55,000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మింపజేసేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనికి బిడ్‌ దాఖలు ప్రక్రియ అక్టోబరులో ప్రారంభం కానుంది. చైనా నుంచి ఎదురయ్యే ముప్పును దృష్టిలో పెట్టుకుని అదనంగా జలాంతర్గాములను సమీకరించుకోవాలని మన దేశం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా దేశీయ కంపెనీలు ప్రముఖ విదేశీ సంస్థలతో కలిసి ఇక్కడే ఇలాంటివి ఉత్పత్తి చేసేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా జలాంతర్గాముల కొలతలు, వాటిలో ఉండాల్సిన సదుపాయాలు వంటివి ఇప్పటికే రక్షణ మంత్రిత్వ శాఖలోని వేర్వేరు బృందాలు ఖరారు చేశాయి. ప్రతిపాదనకు అభ్యర్థన (ఆర్‌ఎఫ్‌పీ)ని అక్టోబరులో జారీ చేయడానికి పూర్వరంగమంతా సిద్ధమైందని అధికార వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే వడపోత పూర్తి

‘భారత్‌లో తయారీ’ కింద జలాంతర్గాముల్ని తయారు చేయించడం కోసం మన దేశం నుంచి ఎల్‌ అండ్‌ టీ గ్రూపు, మజగావ్‌ డాక్స్‌ లిమిటెడ్‌లను.. జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్‌ వంటి దేశాలకు చెందిన కొన్ని సంస్థలను ఇప్పటికే వడపోత విధానంలో ఎంపిక చేశారు. ఆర్‌ఎఫ్‌పీ జారీ అయ్యాక దేశీయ సంస్థలు రెండూ సవివర బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐదు విదేశీ సంస్థల నుంచి భాగస్వామిని అవి ఎంపిక చేసుకుంటాయి. దశలవారీగా మొత్తం 24 జలాంతర్గాములు సమీకరించుకోవాలని నౌకాదళం యోచిస్తోంది. వీటిలో ఆరు అణు జలాంతర్గాములు. ప్రస్తుతం 15 సంప్రదాయ జలాంతర్గాములు, రెండు అణు జలాంతర్గాములు మనకు ఉన్నాయి. చైనా వద్ద 50 జలాంతర్గాములు, 350 యుద్ధనౌకలు ఉన్నాయి. రాబోయే పదేళ్లలో ఈ రెండూ కలిపి 500 దాటనున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత నౌకాదళం మన అవసరాలకు తగ్గట్టు అదనపు కొనుగోళ్లపై దృష్టి సారించింది.

సాంకేతికత బదలాయింపు

వ్యూహాత్మక భాగస్వామ్య విధానంలో 57 యుద్ధ విమానాలు, 234 హెలికాప్టర్లను సమీకరించుకోవాలనేది నేవీ యోచన. దీర్ఘకాలిక భాగస్వామ్యం కింద భారతీయ కంపెనీలతో జత కట్టే విదేశీ కంపెనీలు తమ సాంకేతికతను మనకు బదలాయించాల్సి ఉంటుంది. జలాంతర్గాములు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో పాటు యుద్ధ ట్యాంకులు, సాయుధ పోరాట వాహనాలనూ ఈ విధానంలో తయారు చేయించాలనేది ప్రభుత్వ ప్రణాళిక. 101 రకాల ఆయుధాలు/ రక్షణ వ్యవస్థల దిగుమతుల్ని 2024 నుంచి నిలిపివేయనున్నట్లు ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని ఇదివరకే పెంచింది. రాబోయే ఐదేళ్లలో రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో రూ1.75 లక్షల కోట్ల టర్నోవరును రక్షణ మంత్రిత్వ శాఖ లక్ష్యంగా విధించుకుంది.

ఈనాడు సౌజన్యంతో…..

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.