News

జరిమానా కడతారా? జైలుకు పోతారా? : ప్రశాంత్ భూషణ్ కు శిక్ష విధించిన సుప్రీం

620views

కోర్టు ధిక్కరణకు పాల్పడే విధంగా ట్వీట్లు చేసిన కేసులో న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌కు భారత్‌ అత్యున్నత న్యాయస్థానం నేడు శిక్ష ఖరారు చేసింది. దీనిలో భాగంగా ప్రశాంత్‌ భూషణ్‌కు ఒక్క రూపాయి జరిమానా విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.సెప్టెంబర్‌ 15లోగా రూపాయిని కోర్టుకు డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. డిపాజిట్‌ చేయకపోతే 3 నెలల జైలుశిక్ష , మూడేళ్లపాటు ప్రాక్టీస్‌ చేయకుండా నిషేధం విధిస్తామని తీర్పులో హెచ్చరించింది.

సుప్రీంకోర్టు జడ్జిలు, కోర్టులపై భూషణ్ చేసిన ట్వీట్లను సుమోటోగా స్వీకరించి కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, న్యాయమూర్తులపై అవినీతి ఫిర్యాదుకు అంతర్గత విధానం ఉందనే విషయాన్ని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు చెబుతున్నాయని జస్టిస్ అరుణ్ మిశ్రా విచారణ సందర్భంలో అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే ప్రశాంత్‌ భూషణ్‌ను దోషిగా తేలుస్తూ ఆగస్టు 14న సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకటించింది. ఆయనపై చర్యలకు అవకాశం కలిపిస్తూ క్షమాపణ చెప్పేందుకు నాలుగురోజుల సమయం ఇచ్చింది. కానీ, ప్రశాంత్ భూషణ్ మాత్రం క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. దీంతో ఆగస్టు 25న తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు, నేడు శిక్ష ఖరారు చేసింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.