News

ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనకు కారణం మానవ తప్పిదమే

663views

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనకు మానవ తప్పిదమే కారణమని విశ్రాంత జడ్జి శేషశయనరెడ్డి కమిటీ నివేదిక ఇచ్చింది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ)లో సోమవారం ఈ ఘటనపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్‌జీటీ శేషశయన రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ తన నివేదికను సమర్పించింది. మానవ తప్పిదంతో పాటు, భద్రతా వైఫల్యం, సంస్థ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తన నివేదికలో పేర్కొంది.

విచారణ సందర్భంగా ఎల్‌జీ పాలిమర్స్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఘటనను సుమోటోగా విచారణ చేపట్టే అధికారం ఎన్‌జీటీకి లేదని వాదించారు. మరోవైపు 2001 నుంచి కూడా కంపెనీ అనుమతి లేకుండా నడుస్తోందని ఈఏఎస్‌ శర్మ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. గ్యాస్‌ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వాదనలు విన్న ఎన్‌జీటీ ధర్మాసనం నివేదికను పరిశీలించాలక లిఖిత పూర్వక ఆదేశాలు వెలువరిస్తామని పేర్కొంది. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఎన్‌జీటీ తదుపరి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.