
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా డిల్లీలోని షాహీన్ బాగ్ ప్రాంతంలో నిరసన వ్యక్తం చేస్తున్న వారిని ఎట్టకేలకు పోలీసులు మంగళవారం సాయంత్రం అక్కడి నుంచి తొలగించారు. ఈ క్రమంలో పోలీసుల చర్యను వ్యతిరేకించిన 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దాదాపు దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉన్న విషయం తెలిసిందే. డిల్లీలోనూ కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని నిరసనకారుల్ని కోరినప్పటికీ గత కొన్ని రోజులుగా నిరాకరిస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు వైరస్ వ్యాప్తి క్రమంగా విస్తరిస్తుండడంతో వారిని అక్కడి నుంచి పంపించేశామని పోలీసు అధికారులు తెలిపారు. ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’ సందర్భంగానూ దాదాపు నిరసనకారులంతా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశారు. కేవలం అయిదుగురు మహిళలు మాత్రం అక్కడే ఉండి ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు మూడు నెలల తర్వాత షాహీన్ బాగ్ నిరసనలకు లాక్‌డౌన్ కారణంగా బ్రేక్ పడింది.





