News

కరోనాపై వదంతులు నమ్మకండి: ప్రధాని మోడీ

605views

రోనా వైరస్‌(కొవిడ్‌-19) వ్యాప్తికి సంబంధించి అనేక వదంతులు చక్కర్లు కొడుతున్నాయని, వాటిని నమ్మొద్దని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అలాగే ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు పాటించాలని సూచించారు. ఇతరుల్ని పలకరించేందుకు ‘హ్యాండ్‌ షేక్‌’ విధానాన్ని ప్రక్కన పెట్టి భారత సంప్రదాయ పద్ధతిలో ‘నమస్తే’ చెప్పడం మేలని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఈ ఆచారానికి స్వస్తి పలికి ఉంటే తిరిగి ప్రారంభించడానికి ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన శనివారం ‘జన ఔషధి కేంద్రాల’ యజమానులు, ‘ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి ప్రయోజన'(పీఎంబీజేపీ) పథకం లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ పథకం ద్వారా ప్రతి నెలా దాదాపు కోటి కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. తక్కువ ధరకే మందులు పొంది ఎంతో మంది ప్రాణాలు రక్షించుకుంటున్నారని వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆరు వేల కేంద్రాల ద్వారా ప్రజలు రూ.2000-3000కోట్లు ఆదా చేసుకోగలిగారని తెలిపారు.

ఉద్వేగానికి లోనైన ప్రధాని…

లబ్ధిదారులతో మాట్లాడే సమయంలో ప్రధాని మోడీ భావోద్వేగానికి లోనయ్యారు. కొన్ని సంవత్సరాల క్రితం పక్షవాతానికి గురైన దీపా షా అనే మహిళ పీఎంబీజేపీ కింద అందిస్తున్న మందుల ద్వారా తాను కోలుకున్నానని ప్రధానికి తెలియజేశారు. ప్రతి నెలా రూ.3,000 ఆదా అవుతున్నాయని వివరించారు. ఇది విన్న ప్రధాని ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. ఏటా మార్చి 7న ‘జన్‌ ఔషధి దివస్‌’ని కేంద్రం నిర్వహిస్తూ వస్తోంది. దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో 6,200 జన్‌ ఔషధి కేంద్రాలున్నాయి. దీని ద్వారా అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు ప్రజలకు తక్కువ ధరకే జనరిక్‌ ఔషధాల్ని చేరువచేసే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.