News

చర్చిలకు సర్కారు ప్రేమ కానుక?

1.3kviews

రాష్ట్రంలోని వివిధ జిల్లాల పరిధిలో 76 చర్చిలకు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు 3.65 కోట్ల  రూపాయల విడుదలకు ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. కొత్త చర్చిల నిర్మాణాల  తోపాటు నిర్వహణ, మరమ్మతులు, నవీకరణ, ప్రహరీ గోడల ఏర్పాటుకు ఈ నిధులను కేటాయించింది. విడతలవారీగా నిధులు విడుదల చేయాలని స్థానిక ఎంపీడీవోలు, పురపాలక కమిషనర్లను ఆదేశించింది. రహదారుల ఆక్రమణ, ప్రజా జీవనానికి ఇబ్బంది లేకుండా చేపడితేనే నిధులు విడుదల చేయాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు :

ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల సహా దాదాపు అన్ని దేవాలయాలలోనూ దర్శనం మరియు ఇతర సేవలు, ప్రసాదం రేట్లను విపరీతంగా పెంచేసిన ప్రభుత్వం ఒక్కో చర్చికి 3 లక్షల నుంచీ 5 లక్షల వరకూ ఉచితంగా ఇవ్వడం ఎంతవరకూ సమంజసమని హిందూ సంస్థల ప్రతినిధులు కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ రాష్ట్రంలో హిందువుల దగ్గర లాగేయడం..ముస్లిం, క్రైస్తవులకు పంచడం జరుగుతున్నదని, హిందూ దేవాలయాలకు, ధర్మానికి ఈ ప్రభుత్వ హయాంలో తీరని అన్యాయం జరుగుతున్నదని వారు ఆక్రోశిస్తున్నారు.

అలాగే బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్నా కూడా ఇప్పటికి ఇంకా ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవస్థానం మరమ్మత్తులు పూర్తి చెయ్యలేకపోయిన ప్రభుత్వం ఏదో ముంచుకుపోయినట్లు చర్చిలకు మాత్రం కోట్లాది రూపాయలు మంజూరు చెయ్యడం ఏమిటని ఇంకో హిందూ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. “అన్ని మతాల ప్రజలు కట్టే పన్నుల నుంచి ఇలా ఒక మతానికి నిధులు కేటాయించడమేంటి?” అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఒకవైపు పిఠాపురం దేవాలయాలలోని విగ్రహాల ధ్వంసం, గుంటూరు జిల్లాలోని మండల కేంద్రమైన రొంపిచర్లలో రుక్మిణీ సత్యభామ సమేత మదన గోపాల స్వామి వారి ఆలయంలోని విగ్రహాల ధ్వంసం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో దేవాలయ ముఖ ద్వారం ధ్వంసం, నెల్లూరు జిల్లాలోని దేవాలయ ఉత్సవ రధాన్ని తగులబెట్టిన ఘటనలపై మౌనం దాల్చిన ప్రభుత్వం హిందువుల ఆవేదనను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదని, కానీ ఇప్పుడు ప్రభుత్వం చర్చిలపై ఒలకబోస్తున్న ప్రేమను పరిశీలిస్తే మాత్రం ప్రభుత్వ తీరుపై సందేహం కలుగుతున్నదని, తన వైఖరి ద్వారా ప్రభుత్వమే ఆ విధమైన సంకేతాలను ప్రజలకు ఇస్తున్నదని కొందరు పేర్కొంటున్నారు. ప్రభుత్వం మతపరమైన పక్షపాత ధోరణిని విడనాడక పోతే, హిందువులపైన, హిందూ దేవాలయాలపైన జరుగుతున్న వరుస దాడులను అరికట్టలేక పోతే ప్రజల మధ్య మతపరమైన చీలిక వస్తుందని, అది అనేక తీవ్ర పరిణామాలకు దారి తీసే ప్రమాదమున్నదని వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.