News

మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకండి – టర్కీని హెచ్చరించిన భారత్

1.2kviews

పాకిస్థాన్ మిత్రదేశం టర్కీకి భారత్‌ చురకలంటించింది. భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. ఢిల్లీ ఘటనల్ని ఉద్దేశించి ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్‌ భారత్‌పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో జెనీవాలో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం 43వ వార్షికోత్సవం వేదికగా భారత్‌ ధీటుగా సమాధానం చెప్పింది. ప్రజాస్వామ్య విలువల్ని అర్థం చేసుకొని వ్యవహరించాలని హితవు పలికింది. సమావేశంలో పాకిస్థాన్‌ మరోసారి కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తి రాజకీయం చేయాలని చూసింది. దీన్ని ధీటుగా తిప్పికొట్టిన భారత ప్రతినిధి విమర్శ్‌ ఆర్యన్‌ టర్కీకి సైతం చురకలంటించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని సైతం ప్రోత్సహించొద్దని గట్టిగా హెచ్చరించారు.

టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ (ఫైల్)

భారత్‌పై లేనిపోని విమర్శలు చేయడం ఎర్డోగన్‌ కు కొత్తేమీ కాదు. గతంలో కశ్మీర్‌ విషయంలో పాకిస్థాన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ఐరాస సాధారణ సమితి సమావేశంలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తి విమర్శలపాలయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) పైనా అర్థంలేని ఆరోపణలు చేశారు. ఇలా పలుసార్లు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, చట్టాలపై ఎలాంటి అవగాహన లేకుండానే వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని తాజా పరిణామాలపై యదావిధిగా నోరు పారేసుకున్న టర్కీ అధ్యక్షుడికి భారత్ ధీటుగా సమాధానం చెప్పింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.