
ఆపరేషన్ ఆలౌట్ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. కశ్మీర్‌లో మెల్లిగా మార్పువస్తోంది. ఒకప్పుడు ఉగ్రవాదులు రొమ్ములు విరుచుకు తిరిగిన ప్రాంతాల్లో సాధారణ స్థితి నెలకొంటోంది. సైన్యం అంతర్జాలంపై నిఘా వేయడం.. సోషల్ మీడియాను కట్టడి చేయడంతో ఉగ్ర భావజాలం వల నుంచి యువత బయటపడుతోంది. ఇటీవలే పాఠశాలలు కూడా తెరుచుకొన్నాయి. తాజాగా అంకెలను చూస్తే సైన్యం పాత్రను శెభాష్ అనకుండా ఉండలేము.
దక్షిణ కశ్మీర్, శ్రీనగర్ ప్రాంతాల నుంచి ఎక్కువగా ఉగ్రవాదంలోకి వెళ్లేవారు. వారి సంఖ్య భారీగా పడిపోయింది. 2018లో మొత్తం 220 మంది ఉగ్రవాదంలో చేరితే.. ఆ సంఖ్య 2019 వచ్చేసరికి 120కు తగ్గింది. 2018లో ఎన్‌కౌంటర్లలో 254 మంది 2019లో 161 ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. వీరిలో అత్యధికులు ఉగ్రవాదులుగా మారిన రోజులు,నెలల్లోపే హతమైపోయారు. ఈ విషయం అక్కడి యువతలోకి బలంగా వెళ్లింది. ఉగ్రవాదం నుంచి సాధించేదేమీ లేదనే స్పృహ విస్తృతమైంది. తాజాగా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు కేవలం ఐదుగురు మాత్రమే ఉగ్రవాదంలో చేరినట్లు తెలిసింది. వీరిలో శ్రీనగర్ నుంచి ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్‌కౌంటర్లలో ఉగ్రవాద నాయకత్వాలపై సైన్యం దృష్టిపెట్టింది. ఇటీవల ఎన్‌కౌంటర్లలో వారే ఎక్కువగా మృతి చెందారు. సైన్యం కృషి ఫలితంగా ఉగ్రఘటనలు కూడా తగ్గుముఖం పట్టాయి. 2018లో 318 చోటుచేసుకోగా.. 2019 నాటికి ఇవి 173కు తగ్గాయి.. ఈ ఏడాది ఇప్పటి వరకు 11 మాత్రమే నమోదయ్యాయి.
భద్రతా దళాలు దక్షిణ కశ్మీర్‌పై పూర్తిగా దృష్టిపెట్టాయి. 2019కి ముందు ఇక్కడ దాదాపు 30 మంది ఉగ్రవాదులు చురుగ్గా దాడులు నిర్వహించేవారు. కానీ ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా పకడ్బంధీగా దాడులు నిర్వహిస్తుండటంతో వీరి సంఖ్య ఇప్పుడు మూడుకు పడిపోయింది.
మరోపక్క అవంతిపుర పోలీస్ డివిజన్‌లో మొత్తం 18 మంది ఉగ్రవాదులు పలాయనం చిత్తగించారు. వీరంతా అభా, సంబూరు, పామ్‌పోరే ప్రాంతాల్లో నక్కినట్లు భావిస్తున్నారు. దీంతో త్రాల్ ప్రాంతంలో గతంతో పోలిస్తే ప్రశాంత వాతావరణం నెలకొంది. ముఖ్యంగా సీఆర్‌పీఎఫ్ జవాన్లపై దాడికి కారణమైన జైషే సంస్థ ఇక్కడ తుడిచిపెట్టుకుపోయింది. ఈ విషయాన్ని సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక డైరెక్టర్ జనరల్ జుల్ఫీకర్ హసన్ ఇటీవలే ధ్రువీకరించారు.
దక్షిణ కశ్మీర్‌లోని నాలుగు జిల్లాల్లో మాత్రం ఉగ్రకదలికలు కొనసాగుతున్నాయి. దాదాపు 119 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు అధికారులు లెక్కగట్టారు. వీరిలో 90శాతం మంది స్థానికులు కాగా.. మిగిలిన 10శాతం మంది మాత్రం విదేశీయులు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొత్తం 14 మంది ఉగ్రవాదులను దళాలు మట్టుబెట్టాయి.
శాటిలైట్ ఫోన్లపై కన్ను..
తమ అనుపానులు దళాలకు తెలియకుండా ఉగ్రవాదులు శాటిలైట్ ఫోన్లను విరివిగా వాడేవారు. దీంతో బీఎస్ఎఫ్ అధికారులు దీనిని అడ్డుకొనే టెక్నాలజీ వినియోగించడం మొదలుపెట్టారు. ఫలితంగా ఉగ్రవాదుల శాటిలైట్ ఫోన్ల కదలికలపై దళాలకు కచ్చితమైన సమాచారం లభించడం మొదలైంది. దీంతో ఉగ్రవాద నిరోదక ఆపరేషన్లు వేగవంతమయ్యాయి.
ఊతమిచ్చే వారిపై నిఘా.. ఉగ్రవాదానికి నిధులను సమకూర్చే వారిపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపాయి. కీలకమైన రాజకీయ నాయకులను, వారి బంధువులను కూడా లెక్కచేయకుండా అరెస్టులు చేశాయి. రాళ్లురువ్వే వారిని ఏమాత్రం ఉపేక్షించడంలేదు. దీంతోపాటు లోపాయికారీగా సాయంచేసే డీఎస్పీ దవీందర్ సింగ్ వంటి వారిని అరెస్టు చేశాయి. దీంతో ఉగ్రనెట్‌వర్క్ బలహీనపడిపోయింది. క్షేత్రస్థాయిలో సాయంలేకపోతే తేలిగ్గా ఉగ్రవాదాన్ని అణిచివేయవచ్చనే వ్యూహాన్ని దళాలు అమలు చేస్తున్నాయి.
Source : Enadu.





