
ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో హత్యకు గురైన ఇంటెలీజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, నెహ్రూ విహార్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. అంకిత్ శర్మ మృతికి తాహిర్ హుస్సేన్‌దే బాధ్యత అంటూ శర్మ తండ్రి రవీందర్, బంధువులు ఆరోపిస్తున్నారు.
ఈ ఆరోపణలకు బలం చేకూరేలా సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాహిర్ హుస్సేన్‌కు చెందిన భవనంపై నుంచి కొందరు రాళ్లు, పెట్రోల్ బాంబులు విసురుతుండగా అతను కూడా అక్కడే తిరుగుతున్నట్లు ఆ వీడియోల్లో ఉంది. అంతేగాక, ఆ భవనంలో పలు పెట్రోల్ బాంబులు, రాళ్లు, కర్రలు లభ్యం కావడంతో ఆరోపణలకు బలం చేకూరినట్లయింది. ఈ నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీలోని తాహిర్ హుస్సేన్ ఫ్యాక్టరీని పోలీసులు సీజ్ చేశారు. అయితే, అంకిత్ శర్మ మృతికి తాను కారణం కాదంటూ తాహిర్ హుస్సేన్ వివరణ ఇచ్చారు. కొందరు దుండగులు తన ఇంట్లోకి చొచ్చుకుని వచ్చారని, వారిని ఆపేందుకు తాను ప్రయత్నించానని, తాను అమాయకుడినని చెప్పుకొచ్చారు. ఐబీ అధికారి మరణంపై సమగ్ర దర్యాప్తు చేయాలని అన్నారు. కాగా, తాహిర్ హుస్సేన్ ఇంటికి సమీపంలోనే అంకిత్ శర్మ మృతదేహం లభించడం గమనార్హం. తన కుమారుడిని కొందరు దుండుగులు లాక్కెళ్లారని, కత్తులతో పొడిచి, తుపాకీతో కాల్చి చంపారని అంకిత్ శర్మ తండ్రి రవీందర్ ఆరోపించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





