
129views
చరిత్ర ఎప్పుడూ విజేతల గురించే చెప్పదు.. బాధితుల ఆర్తనాదాలను దాచి ఉంచుతుంది కూడా.. 15వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు ఐరోపాలోను, 1560 నుండి గోవాలో ‘మంత్రగత్తెలు’ అనే పేరుతో వేల సంఖ్యలో క్రైస్తవమతంలోని మహిళలపై జరిగిన అమానుష దాడులు మానవ చరిత్రలో ఒక మాయని మచ్చ. మత విశ్వాసాల పేరుతో మహిళలను సజీవ దహనం చేసిన ఆ భయంకర వాస్తవాలను ఈ రోజు తెలుసుకుందాం. అంతకన్నా ముఖ్యంగా ముందు క్రైస్తవ మతంలో మహిళల గురించి ఎలాంటి వర్ణన ఉందో తెలుసుకుందాం..
క్రైస్తవ మతంలో మహిళ
చారిత్రక కాలం నుండి కొన్ని బైబిల్ వచనాలు మహిళలను తక్కువ చేసి చూడటానికి లేదా వారిని నియంత్రించడానికి ఉపయోగించబడ్డాయి. బైబిల్‌లో ఆదాము తర్వాత హవ్వ సృష్టించబడిందని, ఆమె వల్లే పాపం లోకంలోకి ప్రవేశించిందని చెప్పే వివరణలు ఉన్నాయి.
స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను… వారు ఇంట్లోనే తమ భర్తలను అడగవలెను” (1 కొరింథీయులు 14:34-35) వంటి వచనాలు స్త్రీల స్వేచ్ఛను హరించేవిగా మనం చెప్పవచ్చు.
“స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి” (ఎఫెసీయులకు 5:22), హవ్వ వల్లనే పాపం వచ్చిందనే వాదనలు పితృస్వామ్య వ్యవస్థను బలపరుస్తున్నాయి.
ఇక ఇప్పటికీ కొన్ని సంప్రదాయ క్రైస్తవ శాఖల్లో (ఉదాహరణకు క్యాథలిక్ చర్చిలో) మహిళలకు ‘పాస్టర్లు’ లేదా ‘గురువులు’ అయ్యే అవకాశం లేదు. వారు నన్‌లు గానే ఉండాలి. బైబిల్‌లో స్త్రీని రెండవ తరగతికి చెందినదిగానే చూపించారు.

గోవాతో పాటు ఐరోపాలోని అనేక దేశాల్లో ‘మంత్రగత్తెలు’ (Witch-hunting) అనే పేరుతో వేల సంఖ్యలో మహిళలపై క్రైస్తవ మతాధికారులు అమానుషమైన దాడులు చేయడం, వారిని చంపడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రధాన అంశాలు ఇక్కడ ఉన్నాయి
గోవా ఇంక్విజిషన్: భయంకరమైన 250 ఏళ్లు
గోవాలో పోర్చుగీసు పాలనలో భాగంగా జరిగిన ఇంక్విజిషన్ అత్యంత క్రూరమైనదిగా చరిత్రలో నిలిచిపోయింది. 1560లో ప్రారంభమైన ఈ వ్యవస్థ సుమారు 250 ఏళ్ల పాటు కొనసాగింది. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ విజ్ఞప్తితో గోవాలో ప్రారంభమైన ‘ఇంక్విజిషన్’ ఒక నరకం. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ విజ్ఞప్తి మేరకు పోర్చుగీసు రాజు ఈ వ్యవస్థను గోవాలో ప్రవేశపెట్టారు. మతాధికారులే న్యాయమూర్తులుగా వ్యవహరిస్తూ ఇష్టారీతిన అతి క్రూరమైన తీర్పులు ఇచ్చేవారు.
క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత ఆ విధానాలు నచ్చక తమ పాత హిందూ సంప్రదాయాలను పాటించే వ్యక్తులు (స్త్రీలు కూడా..), తమకు నచ్చనివారిపై మంత్రవిద్యలు చేస్తున్నారని నెపం వేయడం.. ఈ క్రమంలో మహిళలపై మంత్రగత్తెలు అనే ముద్ర వేయడం.. ప్రధానంగా జరిగేవి. క్రైస్తవంలోకి మారిన తర్వాత కూడా హిందువులు ఎవరైనా ఆ విధానాలు నచ్చక తులసి మొక్కను పూజించినా, నుదుటన బొట్టు పెట్టుకున్నా, లేదా వారింట్లో తులసి మొక్క ఉండటం, శాఖాహారం తినడం, లేదా శుభకార్యాల్లో వక్కలు-ఆకులు వాడటం కూడా నేరంగా పరిగణించేవారు. ఇవన్నీ ఒక వ్యక్తి సంస్కృతిని పూర్తిగా నాశనం చేసే ప్రయత్నాలు. వారిని మతద్రోహులుగా ముద్ర వేసేవారు. పాత గోవాలో ‘సంతో అఫీసియో’ అనే పెద్ద భవనం ఉండేది. ఇందులో వందలాది చీకటి గదులు ఉండేవి. అక్కడ మహిళలను బంధించి, నేరం ఒప్పుకోమని చిత్రహింసలు పెట్టేవారు.’ఆటో-డ-ఫే’ అనే పేరిట, శిక్షలను కేవలం రహస్యంగా కాకుండా, ప్రజలందరినీ పిలిచి పెద్ద వేడుకలా (Auto-da-fé) నిర్వహించేవారు. పసుపు రంగు దుస్తులు వేసి, చేతిలో కొవ్వొత్తులు ఇచ్చి ఊరేగించి, చివరికి మంటల్లో కాల్చేవారు. ఇది కేవలం మత విశ్వాసం కాదు, ఒక సంస్కృతిని తుడిచివేసే ప్రయత్నం.ఇంక్విజిషన్ చట్టాల ప్రకారం, ఎవరైనా హిందూ దేవతలను పూజిస్తే వారి పిల్లలను తల్లిదండ్రుల నుండి వేరుచేసి చర్చి ఆధీనంలో పెంచేవారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం తల్లులు తండ్రులు దేశాంతరాలకు పారిపోయారు.

సమాజంలో మహిళల స్వేచ్ఛ పూర్తిగా హరించబడింది. గోవాలో హిందూ సంప్రదాయాలు పాటించే వేలాది కుటుంబాలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కర్ణాటక, మహారాష్ట్ర తీర ప్రాంతాలకు పారిపోయారు.
శిక్షకు గురైన వారి ఆస్తులను చర్చి స్వాధీనం చేసుకునేది. దీంతో ఆర్థికంగా సర్వస్వం కోల్పోయి రోడ్డున పడటం కంటే, ఉన్నదంతా వదులుకుని ప్రాణాలతో బయటపడటమే మేలని ప్రజలు భావించారు.
ఈ వలసల వల్ల గోవా సామాజిక ముఖచిత్రం మారిపోయింది. శతాబ్దాల పాటు సాగిన ఈ అణచివేత వల్ల గోవాలోని హిందూ జనాభా గణనీయంగా తగ్గింది. అయితే, కర్ణాటక, మహారాష్ట్రలో స్థిరపడిన ఈ కుటుంబాలు తమ సంస్కృతిని, భాషను , ఆచారాలను ఇప్పటికీ పదిలంగా కాపాడుకుంటూనే ఉన్నాయి.
గోవా ఇంక్విజిషన్ అనేది కేవలం ఒక మతపరమైన విచారణ మాత్రమే కాదు, అది ఒక జాతి అస్తిత్వంపై జరిగిన దాడి. ప్రాణాల కోసం పారిపోయిన ఆ వేలాది కుటుంబాల కథలు నేటికీ కొంకణ్ తీరంలోని ప్రతి ఇంట్లో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలి ఉన్నాయి.
ఐరోపా దేశాల్లో మహిళలపై దాడి
ఇక 15వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు ఐరోపా దేశాల్లో (ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్) లక్షలాది మంది మహిళలను మంత్రగత్తెలుగా ముద్రవేసి వేధించారు.
అటు ఐరోపాలో ‘మల్లేయస్ మాలెఫికారమ్’ (Malleus Maleficarum) అనే పుస్తకం ఆధారంగా మహిళల వేట మొదలైంది.ఇది 1487లో ఇద్దరు డొమినికన్ సన్యాసులు రాసిన పుస్తకం. మంత్రగత్తెలను ఎలా గుర్తించాలి, వారిని ఎలా శిక్షించాలి అనేది ఇందులో వివరించారు. ఈ పుస్తకం ఆధారంగానే వేల సంఖ్యలో విచారణలు జరిగాయి. ఆ కాలంలో సమాజంలో స్వతంత్రంగా ఉండే మహిళలు, మూలికా వైద్యం చేసేవారు (Midwives), ఒంటరిగా ఉన్న వితంతువులను సులభంగా మంత్రగత్తెలుగా ముద్రవేసేవారు. సుమారు 40,000 నుండి 60,000 మందిని ఈ పేరుతో చంపినట్లు చరిత్రకారుల అంచనా. వారు చేసే పరీక్షలు విడ్డూరంగా ఉండేవి. మహిళను నీటిలో వేసినప్పుడు ఆమె మునిగిపోతే అమాయకురాలని, తేలితే మంత్రగత్తె అని చంపేసేవారు. పుట్టుమచ్చలు లేదా ఇతర మచ్చలను “దయ్యం ముద్ర”గా భావించేవారు. మతాధికారులు సూదులతో ఆ మచ్చలపై గుచ్చి, రక్తం రాకపోయినా లేదా నొప్పి కలగకపోయినా ఆమె మంత్రగత్తె అని నిర్ధారించేవారు.
సుమారు 60 వేల మంది మహిళలు ఈ అంధవిశ్వాసాలకు బలైపోయారు.మంత్రగత్తెగా ముద్రపడిన మహిళ ఆస్తిని తరచుగా చర్చి లేదా స్థానిక అధికారులు స్వాధీనం చేసుకునేవారు. ఆ రోజుల్లో ప్రసవాలు చేసే మహిళలను, మూలికా వైద్యం చేసేవారిని చర్చి వ్యతిరేకించేది. వారు దేవుడి మహిమ కాకుండా మంత్రాలతో నయం చేస్తున్నారని ఆరోపించేవారు.

మతపరమైన అంధవిశ్వాసాలు, పితృస్వామ్య భావజాలం కలిసి మహిళలపై ఇటువంటి దాడులకు దారితీశాయి. ఈ అకృత్యాల వల్ల కేవలం ప్రాణాలు పోవడమే కాకుండా, సమాజంలో మహిళల స్వేచ్ఛ పూర్తిగా హరించబడింది.
లతాకమలం





