
వినూత్న ఆలోచనలతో ప్రజల్లో చైతన్యం తెచ్చి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం జేడీ ఫౌండేషన్ సభ్యులు. వివిధ వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తున్న గోపాలపట్నానికి చెందిన 40 మంది ఆ ఫౌండేషన్‌లో సభ్యులుగా ఉండటం విశేషం. వారు చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తుండటంతో పలువురి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.
1 బాక్సు ఛాలెంజ్..: ‘బాక్సు ఛాలెంజ్‘ కాన్సెప్ట్‌లో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలోని మాంస దుకాణాలకు వెళ్లి మాంసం కొనుగోలు చేసే వినియోగదారుడు స్టీల్‌బాక్సును తెచ్చుకుంటే దుకాణదారుడు రూ.20 తగ్గించేలా ఒప్పించారు. అలాగే ఇళ్ల నుంచి బాక్సులు తెచ్చుకునే వారికి అల్పాహార దుకాణాల్లో ఎక్స్‌ట్రా చెట్నీలు, సాంబారు అందించేలా నిర్వాహకులతో మాట్లాడారు.
2 కంచం తెచ్చుకో.. వస్త్రసంచి పుచ్చుకో..: శుభకార్యాలు.. ఉత్సవాల్లో భోజనాలకు ఎక్కువగా ప్లాస్టిక్ పేపర్లు, ప్లేట్లు, గ్లాసులు వాడుతుంటారు. దీనివల్ల కలిగే అనర్థాలు వివరిస్తూ ‘కంచం తెచ్చుకో.. వస్త్ర సంచి పుచ్చుకో’ పేరుతో ఈ శుభకార్యాలకు స్టీల్ కంచాలు, స్టీల్ గ్లాసులు తెచ్చుకుని భోజనాలకు హాజరయ్యే వారికి రూ.50 విలువ చేసే వస్త్ర సంచులు బహుమతిగా అందిస్తున్నారు.
3 మొక్క నాటండి.. ప్రకృతిని కాపాడండి..: జన్మదినం, పెళ్లిరోజు, ఇతర శుభకార్యాల్లో ప్లాస్టిక్ బహుమతులకు బదులు పూలు, పండ్ల మొక్కలు పంపిణీ చేయాలని అవగాహన కల్పిస్తున్నారు. అలాగే మిద్దెతోటలు పెంచే వారికి ప్రోత్సాహం అందిస్తున్నారు. వారికి అవసరమైన విత్తనాలు, మొక్కలు ఉచితంగా సరఫరా చేస్తున్నారు.
4 కిచెన్ గార్డెన్..: పాఠశాలల్లో పొలంబడి పేరుతో కిచెన్ గార్డెన్ గురించి అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులకు విత్తన బంతుల తయారీ నేర్పిస్తున్నారు. పాఠశాలల్లోని ఖాళీ ప్రదేశాల్లో వంగ, టమాటా, చిక్కుడు, బీర, ఆకుకూరలు వంటి విత్తనాలను నాటిస్తూ.. సంరక్షణ బాధ్యతలను విద్యార్థులకే అప్పగిస్తున్నారు.
5 వర్షపు నీరు ఒడిసిపట్టు..: ‘వర్షపు నీరు ఒడిసిపట్టు’ కార్యక్రమంతో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సొంత నిధులతో ఇంకుడుగుంతలు తీసే కార్యక్రమం చేపట్టారు. కొత్తగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టే యజమానులు ఇంకుడు గుంతలు తీసేలా ప్రోత్సహిస్తున్నారు. తద్వారా భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.





