News

బుర్ఖా ధరించి, హిందూ యువకుడితో నడిచినందుకు ‘‘మోరల్ పోలీసింగ్’’

92views
బుర్ఖా ధరించిన మహిళ, ఓ హిందువుతో నడిచినందుకు ఇప్పుడు మోరల్ పోలీసింగ్ ఎదుర్కొంటోంది. ఈ ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. వీరిద్దరూ రోడ్డుపై నడుస్తున్న క్రమంలో పలువురు వారిని రోడ్డుపై ఆపి, ‘‘మీ మధ్య వున్న సంబంధం ఏమిటి?’’ అంటూ పదే పదే ప్రశ్నించారు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.అలాగే హిందూ యువకుడితో కలిసి నడవడాన్ని తప్పుపడుతూ, అభ్యంతరాలు కూడా లేవదీశారు. అలాగే అతని చేయి ఎందుకు పట్టుకుందని కూడా ప్రశ్నించారు.
వీడియో ప్రకారం ఆ వ్యక్తి హిందువని, ఏం సంబంధం వుందని గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. ముఖ్యంగా ముస్లింలకు మతపరమైన ప్రాముఖ్యత కలిగిన రంజాన్ మాసంలో బుర్ఖా ధరించి ఆమె అతని చేయి పట్టుకోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతగా బయటికి వెళ్లాలనుకుటే బుర్ఖా తీసేయాలని కూడా అన్నట్లు ఆ వీడియోలో వినిపించింది.
దీంతో చివరికి, తామిద్దరూ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నామని బుర్ఖా ధరించిన మహిళ చెప్పినట్లు అందులో వుంది. ఇద్దరూ కలిసి నడుస్తున్నామే తప్పించి, అనుచితమైన సంభాషణలు ఏమీ జరగలేదని పేర్కొంది.ఇంతలా మహిళ వివరణ ఇచ్చినా… ఆ బృందం మాత్రం వినడానికి సిద్ధంగా లేకపోయింది. పదే పదే ప్రశ్నించారు.
మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదూ నమోదు కాలేదు. అయితే.. ఈ వీడియోను చూసి బెంగళూరు పోలీసులు సుమోటోగా స్వీకరించవచ్చన్న వాదనలూ వున్నాయి. ఈ సంఘటనపై పోలీసు అధికారులు ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.