
అటవీ మార్గంలో శబరిమల అయ్యప్ప దేవాలయానికి వెళ్తున్న భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటికే లక్ష మందికి పైగా భక్తులు ఆయా మార్గాల్లో సన్నిధానానికి చేరుకున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. అన్ని మార్గాల్లో కలిపి మొత్తంగా రోజుకు సరాసరి 80వేల మంది శబరిమల దర్శనానికి వస్తున్నారని తెలిపింది.
‘‘ఈ సీజన్‌లో వివిధ అటవీ మార్గాల్లో 1,02,338 మంది భక్తులు సన్నిధానానికి చేరుకున్నారు. అజుతక్కడవ్-పంబ మార్గంలో రోజుకు దాదాపు 1500-2500 మంది భక్తులు వస్తుండగా.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 37,059 మంది వచ్చారు. మరో 64,776 మంది సత్రం మార్గంలో రాగా.. ఈ దారిలో నిత్యం నాలుగు నుంచి ఐదు వేల మంది వస్తున్నారు’’ అని టీడీబీ పేర్కొంది.
అటవీమార్గంలో ఆలయానికి వస్తున్న వారి సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటితో కలిపి ఈ సీజన్‌లో ఇప్పటివరకు మొత్తం 24 లక్షల మందికి పైగా భక్తులు శబరిమలను దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 8న ఒక్కరోజే గరిష్ఠంగా 1,01,844 మంది దర్శించుకోగా, నవంబర్ 24న 1,00,867 మంది వచ్చారని తెలిపాయి.





