
మానవజాతి పురోగమనానికి జ్ఞానం ఎంత ఆవశ్యకమో కొన్ని దశాబ్దాల క్రితమే గుర్తించిన కవి బోయి భీమన్న. ‘జనం వైజ్ఞానికంగా ఎదగటానికి నిరంతరం కృషి చేసేవాడే కవి’ అన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. పాలేర్లు, రైతుకూలీలు తమబిడ్డలను చదివించాలని, తద్వారా వారి అభివృద్ధికి బాటవేయాలని ‘పాలేరు’ నాటకంలో ఉద్బోధించారు. కవికి సహజంగా ఉండవలసిన దృష్టి కూడా ఇదే కదా! పన్నెండేళ్ల వయస్సులోనే భీమన్న మృదుమధురమైన పద్యకవిత రాశారు. ఎన్నో గ్రంథాలను రచించి ప్రచురించారు. కాశీ, ఆంధ్ర, ఉస్మానియా విశ్వవిద్యాలయాల నుండి కళాప్రపూర్ణ గౌరవాన్ని, గౌరవ డాక్టరేట్ పట్టాలను అందుకొన్నారు. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను అందుకొన్నారు. 95 సంవత్సరాలు జీవించటంకాదు విశేషం, చివరిరోజుల వరకు కవిత్వం చెప్పుతూనే ఉన్నారు. గ్రంథాలు వెలువరిస్తూనే ఉన్నారు. ఆయన వ్రాసిన చివరి గ్రంథం ‘శ్రీశ్రీ కమ్యూనిస్టు కాడు’ ఆయన మరణానంతరం వెలువడింది.
కమ్యూనిల్ అవార్డు వివాదం, రౌండ్ టేబుల్ సమావేశాలలో దళితవాణి వినిపించిన నేపథ్యంలో బోయి భీమన్న 1938లో పాలేరు నాటకం రాశారు. ‘దళితజనులకంబేడ్కరు… ధర్మమె మతమన్నాడు… బౌద్ధ ధర్మమొకటేరా భారతీయ మన్నాడు’ అంటూ అంబేడ్కర్ తాత్వికతనే భీమన్న ఆకళింపు చేసుకున్నారు. పాలేరు నాటకంలో దీనినే ఆవిష్కరించారు. సాహిత్యంలో ఆయన సిద్ధాంతం రసాద్వైతం. ఆయన రచనలన్నింటిలోనూ అంతర్లీనంగా ఉన్న విషయం భారతజాతిలో ఏకత్వం. పాలేరు, కూలిరాజు వంటి నాటకాలలోనూ, ‘జన్మాంతర వైరం,’ ‘అంబేడ్కర్ సుప్రభాతం,’ ‘అంబేడ్కరిజం,’ ‘పంచమ స్వరం’ మొదలైన కావ్యాలలోనూ ఈ తపన స్పష్టంగా గోచరిస్తుంది. హరిజనులుగా సమాజంచే పిలువబడ్డవారి అంతరంగాలలో స్వాభిమానాన్ని నింపి, సమకాలీన సమాజంలో గౌరవానికి అర్హులయ్యేటట్లుగా చేయటం భీమన్న గారి సాహిత్య లక్ష్యం.
1911 సెప్టెంబరు 19న తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో పుల్లయ్య, నాగమ్మ దంపతులకు జన్మించిన భీమన్న కాకినాడలో కళాశాలవిద్య పూర్తిచేశారు. 1937 నుండి ప్రముఖ హరిజన నాయకులు కుసుమ ధర్మన్న గారి పత్రిక ‘జయభేరి’లో సహాయ సంపాదకులుగా పనిచేశారు. 1953లో గుంటూరు జిల్లా చెరుకుమిల్లి గ్రామ ప్రజలు ఆయనకు గండపెండేరం తొడిగి సన్మానించారు. 1955 నుండి రాష్ట్రప్రభుత్వంలో అనువాదకునిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి నామినేట్ అయ్యారు. కేంద్రసాహిత్య అకాడమీ నుండి పురస్కారం అందుకొన్నారు. జాషువా ఫౌండేషన్ వారు ఇచ్చే జాషువా పురస్కారాన్ని అందుకొన్న ఏకైక ఆంధ్రుడు భీమన్న.
“సామాజిక సమరసత, సాహితీ సమర్చన రెండు కళ్ళుగా జీవించారు బోయి భీమన్న” అంటారు ప్రముఖ సాహితీవేత్త ఆశావాది ప్రకాశరావు. కులంలేని జాతి కోసం భీమన్న కలలు గన్నాడు. కవి భావాలు సత్యగుణ ప్రధానం అయితే స్వచ్ఛ సమాజ స్థాపన జరుగుతుందని ఆయన విశ్వసించాడు. డిసెంబరు 16, 2005న తుదిశ్వాస విడిచిన తన రచనల్లో కులమతాల కంటే మానవతకు ప్రాధాన్యాన్నిచ్చారు. భీమన్న చూపిన సమరసతా మార్గంలో పయనిద్దాం…. సమైక్య, సమరస భారతాన్ని నిర్మిద్దాం. సమరసత ఓ ఆచరణాత్మక అంశం. ఇది హృదయానికి సంబంధించిన భావావేశం. వ్యక్తి వ్యష్టి నుండి సమిష్టి…. పరమేష్ఠి వైపు కొనసాగే ఓ హృదయపరివర్తన సమరసత. హృదయ విశాలత అలవడితే సమరసత సాధ్యం. ఆ దిశలో అడుగులు వేద్దాం… విశ్వ మానవతకు పెద్దపీట వేద్దాం. విశ్వ కళ్యాణాన్ని సాధిద్దాం.




