ArticlesNews

ఆదర్శ కుటుంబం

181views

జీవితంలో గొడవలు ఉండకూడదు. ఇంట్లోనూ బయటా శాంతంగా ఉండాలి. ఒకరికొకరు మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ బతకాలి. ఆధ్యాత్మిక ప్రవచనాలు, సూక్తులు, స్తోత్రాలు వింటూ జీవించాలి. ఇల్లు ఒక నిశ్చల సరస్సులా, గ్రంథాలయంలా నిశ్శబ్దంగా ఉండాలి. ఆదర్శ కుటుంబం అని పేరు తెచ్చుకోవాలి. ఇటువంటి కుటుంబాలను కృత్రిమ మేధతో సృష్టించుకోవచ్చేమో కానీ, నిజానికి ఏ ఇల్లూ ఇలా ఉండదు!

గొడవలు లేని జీవితం జీవితమే కాదు. మనం కోరుకోకపోయినా సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిని పరిష్కరించుకోవాలి. కొత్తవి వస్తుంటే మళ్లీ మళ్లీ ఎదుర్కొని, పరిష్కారాలు సాధించి జీవనయానం సాగించాలి. ఓం శాంతి శాంతి శాంతిః అని ఇంట్లో అనుకుంటూ బతకడం మంచిదే గాని, శాంతిని ఎవరు కోరుకుంటున్నారో వాళ్లు పోరాటానికి సిద్ధపడాలి. యుద్ధం లేని జీవితం లేదు. దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. పుట్టుకలో యుద్ధం ఉంది. బతకడంలో, చావడంలో యుద్ధం ఉంది. గీతాచార్యుడు యుద్ధానికి భయపడొద్దని చెప్పాడు. దాన్ని ఎదుర్కోవాలి. భీరువులా పారిపోకూడదు. లేనిపోని భయాలతో వణికిపోకూడదు. ప్రతి మనసూ కురుక్షేత్రమే. మనుషులు మనసులు రణ రంగాలవుతుంటే, వాళ్లు నివసిస్తున్న ఇల్లు శాంతి క్షేత్రం ఎలా అవుతుంది? ధ్యానమందిరంగా ఎలా విలసిల్లుతుంది? యుద్ధం పూర్వాపరాలు తెలుసుకోవడానికే ప్రతి జీవి భూమ్మీదకు వచ్చింది. తెలిసో తెలియకో ప్రతి ఒక్కరూ యుద్ధం చేస్తారు. గెలుస్తారు, ఓడిపోతారు. ఓడుతూ గెలుస్తారు. గెలుస్తూ ఓడుతారు. యుద్ధమనేది నిరంతరం జరిగే ప్రక్రియ.

భూమి మీద ఎప్పుడూ యుద్ధ వాతావరణం ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా చిన్నదో పెద్దదో యుద్ధం జరుగుతూ ఉంటుంది. ప్రతి సభ్యుడూ అలవాటైన సైనికుడిలా క్షణాల్లో యుద్ధానికి తయారైపోతారు. బంధాలు, బంధుత్వాలు వెనక్కి లాగుతున్నా పోరాడాలి, పోరాడుతూనే ఉండాలి! గొడవలు లేని ఇల్లని ఏ ఇంటినైనా చెప్పుకోగలమా? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల కారణంగా జ్ఞానుల కుటుంబాలలో కూడా యుద్ధం ఉంటుంది. అయితే అది శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఉంటుంది. అంతా కృష్ణార్పణం అని వాళ్లు పోరాటంలో పాల్గొంటారు. కర్మఫలత్యాగం అని గెలుపోటములకు అతీతంగా ఉంటారు. యుద్ధాన్ని నివారించే రాయబారాలు ఇళ్లల్లో ఉంటాయి. అవి సఫలం కావొచ్చు. కాకపోవచ్చు.

భగవద్గీతలో మూల విషయం యుద్ధం. దాన్ని సృష్టించి, అందులో మానవ ఆత్మని సమగ్రంగా ఆవిష్కరించాడు పరమాత్మ. యుద్ధ నైపుణ్యం తెలిసినవాడు, యుద్ధంలో వేదాంతం, వైరాగ్యం గ్రహించినవాడు యుద్ధవీరుడిగా పేరు తెచ్చుకుంటాడు. మరణానికి భయపడడు. తాను బతుకుతాడు. ఇతరులను బతికిస్తాడు. గొడవలు లేని జీవితం ఉంటుందంటే అతడు నమ్మడు, ఎవరూ నమ్మకూడదు. పోరాటానికి సిద్ధపడటం అంటే జీవితంలో ముందుకెళ్లడమే. మానసిక యుద్ధంలో నెగ్గుకొచ్చిన వ్యక్తే శాంతి సామరస్యాలను అనుభవించడానికి అర్హుడవుతాడు.