
హస్తకళలకు కాణాచిగా శ్రీకాళహస్తి ఘన కీర్తిని పొందుతోంది. ఇక్కడి కళాకారులు జాతీయ స్థాయి అవార్డులతో కళకు మరింత ఖ్యాతిని తీసుకువస్తున్నారు. కేంద్ర జౌళిశాఖ, హస్తకళాభివృద్ధి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన పోటీల్లో శ్రీకాళహస్తిలో పుట్టి పెరిగిన విజయలక్ష్మి అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం వెంకటగిరికి చెందిన జగన్నాథంను వివాహం చేసుకుని అక్కడే ఉంటున్నారు. ఈమె కుంచె నుంచి జాలువారిన సంపూర్ణ రామాయణం హస్తకళా చిత్రానికి భారత ప్రభుత్వం జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. దిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.
సోదరి సైతం..: కలంకారీ కళలో విజయలక్ష్మి సోదరి మునిరత్నమ్మ 2008లో జాతీయ అవార్డును అందుకున్నారు. సోదరి ఎలాగైనా జాతీయ స్థాయి అవార్డును అందుకోవాలన్న పట్టుదలతో ఆమె చేత సంపూర్ణ రామాయణం కలంకారీ చిత్రానికి జీవం పోయించింది. అవార్డు అందుకునేలోపు అనారోగ్యానికి గురైన మునిరత్నమ్మ వీరి కుటుంబానికి దూరమయ్యారు. అక్క ఇచ్చిన స్ఫూర్తితోనే ఈ అవార్డును దక్కించుకోగల్గినట్లు ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
తరతరాలుగా నమ్ముకున్నారు
విజయలక్ష్మి తండ్రి మునిరెడ్డి కలంకారీ కళను నమ్ముకున్నారు. ఈ వస్త్రాలకు ఆదరణలేని సమయంలోనే తమిళనాడు, హైదరాబాదు, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లి వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించారు. తండ్రి వారసత్వాన్ని కుమార్తెలతో పాటు కుమారుడు అదే రంగంలో తమకంటూ గుర్తింపును పొందారు. రామాయణ, మహాభారత, భాగవతాది ఇతిహాస ఘట్టాలకు కలంకారీ వస్త్రంపై చిత్రరూపంతో జీవం పోయడంతోపాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.





